నాన్న సినిమాలో ‘అన్న’ బాటలో – Nostalgia

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన మంచు మనోజ్ ఆ తర్వాత హీరోగానూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ మధ్య విజయాలు దక్కక రేస్ లో కొంచెం వెనుక బడ్డాడు కానీ సరైన కథ దర్శకుడు దొరికితే దుమ్మురేపే సత్తా ఇతనిలో ఉందన్న వాస్తవం సగటు ప్రేక్షకుడు ఎవరైనా ఒప్పుకుంటారు . మనోజ్ కు చిన్నతనంలో బాలనటుడిగా స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి మహామహులతో పని చేసే అదృష్టం దక్కింది. మేజర్ చంద్రకాంత్ లో చేసింది చిన్న పాత్రే అయినా మావయ్య మొహన్ బాబుని టీజ్ చేసే రోల్ లో అలరించాడు.

ఇలా పుణ్యభూమి నా దేశం, బ్రహ్మ, ఖైదీగారు లాంటి ఇతర సినిమాల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలే చేశాడు. అయితే ఇవన్నీ కమర్షియల్ మూవీస్. 1997లో వచ్చిన అడవిలో అన్న మాత్రం ప్రత్యేకమైన చిత్రంగా చెప్పుకోవాలి. కారణం అప్పటి ఎర్ర సినిమాల ట్రెండ్ లో అడవిలో అన్న మంచి విజయం దక్కించుకుంది. ఆర్ నారాయణమూర్తి పుణ్యమాని క్లాసు ప్రేక్షకులు సైతం ఆదరించేలా విప్లవ సినిమాలు 90వ దశకంలో చాలానే వచ్చాయి. విజయశాంతి, కృష్ణ, దాసరి లాంటి దిగ్గజాలు సైతం వీటి బాట పట్టి మంచి విజయాలు అందుకున్నారు. ఆ టైంలో బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు స్వీయ నిర్మాణంలో అడవిలో అన్న రూపొందింది. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం పిల్లర్లుగా నిలబడి విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇందులో మనోజ్ చిన్న పాత్రలో కనిపించి మెప్పిస్తాడు. రోజా హీరోయిన్ గా నటించడం కూడా దీనికి చాలా ప్లస్ అయ్యింది. కమర్షియల్ హంగులు జోడిస్తూనే ఆలోచింపజేసే రీతిలో అడవిలో అన్నను తీర్చిదిద్దిన తీరు వసూళ్లు కూడా ఘనంగా దక్కేలా చేసింది. దీని స్ఫూర్తితోనే మోహన్ బాబు ఆ తర్వాత శ్రీరాములయ్య కూడా నిర్మించారు. డిఫరెంట్ జానర్లో చిత్రాలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ రకంగా అడవిలో అన్న మంచు మనోజ్ కు స్వీట్ మెమరీ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా లెవెల్ సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్ దీంతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాననే ధీమాతో ఉన్నాడు. టాలెంట్ ఎంత ఉన్నా ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే విజయలక్ష్మి రావడం ఆలస్యమవుతుందని చెప్పడానికి మంచు మనోజ్ కెరీర్ నే ఉదాహరణగా తీసుకోవచ్చు.

Show comments