చంద్రుడి మీద గోల్ఫ్ ఆడిన వ్యోమగామి

యాభై సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 6 1971 న చంద్రుడు ఉపరితలం మీద అమెరికా దేశపు అపోలో-14 మిషన్ లో భాగంగా దిగిన అలాన్ షెపర్డ్ అనే వ్యోమగామి తమ మిషన్ లో భాగంగా చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాక తన వెంట తెచ్చుకున్న రెండు గోల్ఫ్ బంతులను, చంద్రుడి మీద మట్టిని శాంపిల్ తీసే పరికరానికి అతికించిన గోల్ఫ్ క్లబ్ తాలూకూ హెడ్ ఉపయోగించి రెండు షాట్ లు కొట్టాడు.

చంద్రుడు మీద గురుత్వాకర్షణ శక్తి భూమితో పోలిస్తే ఆరవ వంతు మాత్రమే ఉంటుందన్న విషయం ప్రదర్శించడానికి కెమెరా ముందు ఆ రెండు బంతులను కొట్టాడు షెపర్డ్. రెండవ షాట్ కొట్టాక, కెమెరా వైపు తిరిగి, “బాల్ మైళ్ళ దూరం వెళ్లింది” అని గట్టిగా అరిచాడు షెపర్డ్. అయితే వాస్తవానికి మొదటి బంతి 22 మీటర్ల దూరం, రెండవ బంతి 37 మీటర్ల దూరం వెళ్ళింది. ఆ రోజుల్లో ఉన్న గోల్ఫ్ క్లబ్ తో భూమి మీద సరదాకి గోల్ఫ్ ఆడే ఆటగాళ్లు మగవారు కొడితే 198 మీటర్లు, ఆడవారైతే 135 మీటర్లు వెళ్ళేది బంతి.

అయితే చంద్రుడు మీద బంతిని కొట్టినప్పుడు షెపర్డ్ 90 కేజీల బరువు ఉన్న స్పేస్ సూట్ ధరించి, సరైన గ్రిప్ లేని గ్లవ్ ధరించి, ఒక చేతితో కొట్టాడు. అదీగాక, అపోలో-14 చంద్రుడు మీద ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతంలో దిగింది కాబట్టి బంతి గమనానికి అది కూడా ప్రతికూలంగా మారింది.

ప్రేరణ ఇచ్చిన గోల్ఫ్ ఛాంపియన్

అపోలో-14 మిషన్ కోసం ఎంపికైన మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి నాసా కేంద్రంలో షెపర్డ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఒక టెలివిజన్ కార్యక్రమం కోసం అమెరికాకి చెందిన గోల్ఫ్ ఛాంపియన్ బాబ్ హోప్ వచ్చాడు. అతను ఎక్కడికి వెళ్లినా తనవెంట తన గోల్ఫ్ క్లబ్ తీసుకెళ్ళేవాడు. అది చూశాక ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారుడు అయిన అలాన్ షెపర్డ్ కి చంద్రుడు ఉపరితలం మీద గోల్ఫ్ షాట్ ఆడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చింది.

అయితే అపోలో మిషన్ ని పర్యవేక్షణ చేసే నాసావారి మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ సెంటర్ డైరెక్టర్ బాబ్ గిల్రూత్ ఈ ఆలోచనను ఒప్పుకోలేదు. ఇలాంటి మిషన్లలో రాకెట్ రవాణా చేసే పే లోడ్ విషయంలో కచ్చితంగా ఉంటారు శాస్త్రవేత్తలు. చంద్రుడి మీద ఉన్న ఎత్తైన ఉపరితలం మీద దిగబోతున్న మొట్టమొదటి మిషన్ కాబట్టి ఆ ప్రాంతం నుంచి సేకరించిన మట్టి, రాళ్ళు చాలా ముఖ్యం ఈ మిషన్ విజయానికి. చంద్రుడు మీద దిగాక తాము చేయవలసిన పరిశోధనలు పూర్తయ్యాకే తను గోల్ఫ్ షాట్ ఆడుతానని, దాని కోసం అదనపు బరువు లేకుండా చంద్రుడు ఉపరితలం నుంచి నమూనాలు సేకరించే పరికరానికి ఒకవైపు గోల్ఫ్ క్లబ్ తాలూకు హెడ్ బిగించి అదనపు బరువు లేకుండా చూసుకుంటానని, అవసరమైతే తిరిగి వచ్చే సమయంలో బరువు ఎక్కువైతే దాన్ని చంద్రుడు మీదే వదిలేసి వస్తానని గిల్రూత్ తో చెప్పి, చంద్రుడు మీద గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుందని సాధారణ ప్రజానీకానికి తెలియజేయడానికి ఆ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని అతన్ని ఒప్పించాడు షెపర్డ్.

చంద్రుడు మీద గోల్ఫ్

గిల్రూత్ పర్మిషన్ తీసుకున్న షెపర్డ్ హూస్టన్ నగరంలోని ఒక గోల్ఫ్ క్లబ్ ద్వారా తనకు కావలసిన విధంగా చంద్రుడు ఉపరితలం నుంచి నమూనాలు సేకరించే పరికరానికి గోల్ఫ్ హెడ్ అంటించాడు. తన శిక్షణలో భాగంగా స్పేస్ సూట్ వేసుకుని గోల్ఫ్ బంతిని కొట్టడం కూడా ప్రాక్టీస్ చేశాడు.

జనవరి 31, 1971న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శాటర్న్ – V రాకెట్లో పయనమైన ముగ్గురు వ్యోమగాముల బృందం ఫిబ్రవరి 5 న చంద్రుడి మీద దిగింది. 5,6 తేదీలలో రెండు విడతలుగా చంద్రుడి మీదకు అడుగుపెట్టి తమకు నిర్దేశించిన పరిశోధనలు చేసి, 42.80 కిలోగ్రాముల నమూనాలు సేకరించిన తర్వాత తిరిగి వచ్చే ముందు కెమెరాల ముందు నిలబడి ఒంటి చేత్తో తన వెంట తెచ్చుకున్న రెండు గోల్ఫ్ బంతులను రెండు షాట్లు కొట్టాడు షెపర్డ్. బంతులను అక్కడే వదిలేసి, కొట్టడానికి వాడిన క్లబ్ మాత్రం తిరిగి తీసుకొచ్చాడు.

గోల్ఫ్ మ్యూజియంకి దానం

చంద్రుడు మీద గోల్ఫ్ బంతిని కొట్టడానికి వాడిన క్లబ్ కొన్ని రోజులు షెపర్డ్ వద్దనే ఉండేది. అయితే 1974లో మరో గోల్ఫ్ ఆటగాడు బింగ్ కోస్బీ అభ్యర్థన తో న్యూ జెర్సీ లోని యునైటెడ్ స్టేట్స్ గోల్ఫ్ అసోసియేషన్ వారి మ్యూజియంకి దానంగా ఇచ్చాడు.

తన అనుభవం గురించి 1998లో తన మరణానికి కొన్ని రోజుల ముందు ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఆ అనుభవం చాలాగొప్పగా ఉంది. ఇప్పటివరకు చరిత్రలో చంద్రుడి మీద గోల్ఫ్ ఆడిన మానవుడిని నేనొక్కడినే. చంద్రుడి ఉపరితలం మీద గోల్ఫ్ ఆడడం మరిచిపోలేని అనుభవం” అని చెప్పాడు.

నాసా వారు ఆర్టైమిస్ పేరుతో 2024లో చంద్రుడు మీదకు పంపించే వ్యోమగాములకు ఇదివరకటిలా బిగుతైన స్పేస్ సూట్లు కాకుండా ఫ్లెక్సిబుల్ సూట్లు రూపొందిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈసారి చంద్రుడు మీద గోల్ఫ్ షాట్ కొడితే ఈసారి బంతి కచ్చితంగా అలాన్ షెపర్డ్ కొట్టినదాని కన్నా ఎక్కువ దూరం కొట్టగలుగుతారు.

Show comments