Idream media
Idream media
కరోనా వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్‌లను సరిహద్దుల వద్ద తెలంగాణ ప్రభుత్వం ఆపడం, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు జోక్యంతో వివాదం సమసిపోయింది. అయితే తాజాగా సాధారణ వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌కు వచ్చే ఏపీ వాసులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర పోలీసు శాఖ పాస్‌లు జారీ చేస్తోంది. అదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారికి ఏపీ ప్రభుత్వం ఇచ్చే పాస్ తప్పనిసరంటూ నిబంధన విధించింది. పాస్‌లు లేకపోయినా చాలా మంది హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారిని సరిహద్దుల వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. పాస్‌లు ఉన్న వారిని, అంబులెన్స్‌లు, ఆస్పత్రులకు వచ్చే వారిని అనుమతిస్తున్నారు. ఇవీ రెండు రోజుల నుంచి ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద జరుగుతున్న వివాదంపై పూర్వాపరాలు.
వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించకుండా, వారిని మరింత రెచ్చగొట్టేలా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేందుకు ఈ వ్యవహారాన్ని కూడా ప్రతిపక్ష టీడీపీ ఉపయోగించుకుంటోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు మాటలు వింటే.. వారి లక్ష్యం ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అంతర్భాగం కాదా..? సరిహద్దుల వద్ద అడ్డుకోవడం ఏమిటి..? సీఎం వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు..? సరిహద్దుల వద్ద పోలీసులు ప్రజలపై లాఠీ ఛార్జి చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలను పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం అంటూ అచ్చెం నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.
అసలు వాస్తవం ప్రజలకు వివరించి.. పాస్‌లు తీసుకుని వెళ్లేలే వారిని చైతన్య పరచాల్సిన ప్రతిపక్షం ఆ పని చేయకుండా.. వారిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉంది. అదే సమయంలో అచ్చెం నాయుడు చేసిన వ్యాఖ్యలతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశంపై మరోసారి ప్రజల మధ్య చర్చకు వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చట్టంలో పెట్టిన హైదరాబాద్‌ను, దానిపై హక్కును ఎందుకు వదులుకున్నాం..? రాష్ట్ర విభజన జరిగిన ఏడాదికే హైదరాబాద్‌ను వదిలేసి హడావుడిగా విజయవాడకు నాటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది..? అనే ప్రశ్నలు మరోసారి ప్రజల మదిలో మెదులుతున్నాయి.
Also Read : బుచ్చయ్య చౌదరి ఇలా మారిపోయారేంటి..?
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు చంద్రబాబు అండ్ కో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన ఓటును తుమ్మలకు వ్యతిరేకంగా వేసేందుకు లంచం ఇచ్చింది. 5 కోట్లకు బేరం కుదరగా.. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్టీఫెన్స్‌న్‌కు ఇస్తూ ఆడియో, వీడియో రికార్డులతో దొరికిపోయారు. చంద్రబాబు కూడా స్టీఫెన్సన్‌కు ఫోన్ చేసి.. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడారు. ఈ విషయంలో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం నాకు ఏసీబీ ఉంది.. నీకు ఏసీబీ ఉంది.. రా తెల్చుకుందాం.. కేసీఆర్ అంటూ సవాళ్లు విసిరారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ తిరిగి తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టారు.
ఈ వివాదం కొన్ని రోజులు నడిచిన తర్వాత… తెర వెనుక ఏం ఒప్పందం జరిగిందో.. అందులో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో కానీ.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ సచివాలయం, ఇతర శాఖలను, తన క్యాంపు కార్యాలయాన్ని మూకుమ్ముడిగా విజయవాడకు తరలించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లోగానీ, తెలంగాణ వ్యవహారాల్లోగానీ చంద్రబాబు తలదూర్చలేదు. కనీసం మాట కూడా మాట్లాడలేదు.
తెలంగాణలో టీడీపీ వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా.. బాబు గానీ, ఆయన తనయుడు లోకేష్‌లు గానీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా.. ఆ వైపు కన్నేత్తి చూడలేదు. నేతలతో సమీక్షలు, దిశానిర్థేశాలు చేయలేదు. మొత్తం మీద ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదాను కూడా అటెక్కించారనే ప్రచారం సాగింది. దానికి బలం చేకూరేలా ఓటుకు నోటు వ్యవహారంలో దాదాపు ఏడేళ్లుగా చంద్రబాబుపై ఎలాంటి చర్యలు లేవు. ఈ కేసు నుంచి చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేదంటూ కేసీఆర్ మాట్లాడినా.. అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడం గమనార్హం.
ప్రజలను రెచ్చగొడుతూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు.. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అంతర్భగం కాదా..? అంటూ ప్రశ్నిస్తున్నా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. నాడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఉన్న పదేళ్ల హక్కులను వదులుకుని ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది. నాడు చంద్రబాబుకు, కేసీఆర్‌కు జరిగిన ఒప్పందంలో ఏమేమి నిబంధనలు ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి అచ్చెం నాయుడు.. తమ అధినేత చంద్రబాబు నుంచి ఆ విషయాలు తెలుసుకుని ప్రజలకు వివరిస్తారా..?
Also Read : పరీక్షలపై ఇప్పుడేమంటారో..? జగన్ సర్కారు చెబితే నై అని, కేంద్రం ముందుకు రాగానే సై అంటారా?