కొనసాగుతున్న ఉత్కంఠ.. రాత్రికి మంత్రుల జాబితా.. రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం

నూతన మంత్రివర్గం ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 11:31 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో.. ఆ జాబితాలో ఎవరు ఉంటారనే అంశం ఇంకా ఫైనల్‌ కాలేదు. మంత్రివర్గ కూర్పుపై సీఎం వైఎస్‌ జగన్‌.. పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి ఉంటారనే అంచనాల నేపథ్యంలో.. సమర్థత, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా తుది జాబితా ఖరారుకు ఎక్కువ సమయం పడుతోంది.

రాత్రికి తుది జాబితా..

రెండు రోజులుగా నూతన మంత్రివర్గంపై సీఎం జగన్‌ కసరత్తులు చేస్తున్నారు. నూతన మంత్రివర్గ ఏర్పాటు గురించి గవర్నర్‌కు తెలిపిన తర్వాత.. మంత్రులుగా ఎవరిని నియమించాలనే అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టి పెట్టారు. సోమవారం ఉదయం 11:31 గంటలకు మంత్రులు ప్రమాణం చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు తుది జాబితాను విడుదల చేస్తారని ప్రచారం సాగింది. గవర్నర్‌కు జాబితాను పంపిన తర్వాత.. మీడియాకు ఆ జాబితాను అందజేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తుది జాబితాలో పాత మంత్రులు పదిమంది, కొత్తగా 15 మందికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో పాతవారిని ఎవరిని కొనసాగించాలని, కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి, జిల్లాకు ఒక మంత్రి ఉండేలా చూడాల్సి రావడంతో.. తుది జాబితా రూపొందించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. మంత్రివర్గంలో అన్ని ప్రధాన సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, సమర్థతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్‌ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన జాబితా ఆలస్యమైంది. మూడు గంటలకు జాబితా విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆ జాబితా ఇంకా ఆలస్యం అవుతోంది. రాత్రి 7 గంటలకు జాబితా విడుదల చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాకు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమైన సజ్జల.. కొద్దిసేపటి క్రితం మరోమారు భేటీ అయ్యారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జాబితాను రాత్రికి విడుదల చేస్తామని చెప్పారు.

కాగా, మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆదివారం మధ్యాహ్నం ఆమోదించారు. 24 మంది మంత్రులు ఒకేసారి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరందరూ తమ రాజీనామాలను సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేశారు. ఆ రాజీనామా పత్రాలను సీఎం జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు పంపగా.. తాజాగా వాటికి ఆమోదముద్ర వేశారు.

Show comments