Idream media
Idream media
సరిగ్గా ఆరేళ్లు.. అంతలో ఎంత మార్పు..? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు, వార్డులను టీడీపీ గెలుచుకుంది. వైసీపీ కూడా తన పట్టును నిలుపుకుంది. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గా ఫలితాలు వచ్చాయి. వైసీపీ ధాటికి టీడీపీ ఎక్కడా నిలువలేకపోయింది.
2014లో అలా.. 2021లో ఇలా..
పోయిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 1,424 వార్డులు, డివిజన్లలో టీడీపీ గెలిచింది. మొత్తం వార్డులు, డివిజన్లలో టీడీపీ 55.39 శాతం గెలుచుకుంది. ఇక వైసీపీ 939 వార్డులు, డివిజన్లను సొంతం చేసుకుంది. మొత్తం 35.62 శాతం మేర వార్డులు, డివిజన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,742 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. ఏకగ్రీవాలతో కలుపుకుని వైసీపీ 2,265 వార్డులు, డివిజన్లను కైవసం చేసుకుంది. టీడీపీ 348 వార్డులు, డివిజన్లను గెలుచుకుంది. మొత్తం వార్డులు, డివిజన్లలో వైసీపీ 81.07 శాతం గెలుచుకోగా టీడీపీ 12.70 శాతం మాత్రమే గెలుచుకోగలిగింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ 42 శాతం మేర వార్డులు, డివిజన్లను కోల్పోయింది.
.
క్లీన్ స్వీప్..
12 నగరపాలక సంస్థలు, 75 పుర, నగరపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఏలూరు కార్పొరేషన్ మినహా అన్ని ఫలితాలు వెల్లడయ్యాయి. 11 కార్పొరేషన్లను వైసీపీ భారీ మెజారిటీతో గెలుచుంది. 75 పుర, నగరపంచాయతీలలో 73ను తన ఖాతాలో వేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ సగం సీట్లను గెలుచుకున్నా.. ఎక్స్ అఫిషియో ఓట్లతో ఆ రెండు మున్సిపాలిటీలు కూడా వైసీపీ కైవసం చేసుకోవడం లాంఛనమే.
నగరాలలో వైసీపీ బలంగా తయారైందని తాజా ఫలితాలు ద్వారా తెలుస్తోంది. 11 కార్పొరేషన్లలో 621 డివిజన్లకు గాను వైసీపీ 515 (83 శాతం) కైవసం చేసుకుంది. టీడీపీ 78 (12.6 శాతం) డివిజన్లకే పరిమిమైంది. బీజేపీ, జనసేన, స్వతంత్రులు 27 (4.4 శాతం) డివిజన్లను గెలుచుకోగలిగారు.
Also Read : మునిసిపల్ ఎన్నికలు -ప్రతిపక్షాలకు మిగిలిన మార్గమేంటి
12 చోట్ల సున్నా.. 13 చోట్ల ఒకే ఒక్కరు..
పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ టీడీపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆ పార్టీ తరఫున ఒక్కరు కూడా గెలవలేదు. తుని, మాచర్ల, పిడుగురాళ్ల, కనిగిరి, వెంకటగిరి, ధర్మవరం, డోన్, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, ఎర్రగుంట్ల, పుంగూరులలో టీడీపీ ఖాతానే తెరవలేదు. మరో 13 చోట్ల ఒక్క కౌన్సిలర్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రామచంద్రపురం, నరసాపురం, నిడదవోలు, పెడన, చీరాల, సూళ్లూరుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరు, ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు, గుత్తి, యలమంచిలి మున్సిపాలిటీల్లో ఒక వార్డు చొప్పన టీడీపీ గెలుచుకుంది.
బీజేపీ–జనసేనల ప్రభావం అంతంత మాత్రమే..
ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ–జనసేన పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. పొత్తులు పెట్టుకుని, పలు చోట్ల టీడీపీ మద్ధతుతో పోటీ చేసినా ఆ రెండు పార్టీలు చెప్పుకోదగ్గ వార్డులు, డివిజన్లను గెలుచుకోలేకపోయింది. జనసేన పార్టీ నగరపాలక సంస్థల్లో ఏడు వార్డులు, పురపాలక, నగరపంచాయతీల్లో 19 వార్డులను గెలుచుకుంది. బీజేపీ నగరపాలక సంస్థల్లో కేవలం ఒక్కచోట మాత్రమే గెలిచింది. పుర, నగర పంచాయతీల్లో 8 వార్డులు గెలుచుకుంది. నగరాలు, పట్టణాలలో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉందనుకుంటున్న బీజేపీకి ఈ ఫలితాలతో జ్ఞానోదయం అయింది.
Also Read : మరోసారి సత్తా చాటిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి