Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి ప్రారంభమైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ విధించలేదని పేర్కొంటూ ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిని పాటించలేదని, సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాలపాటు కోడ్ అమలు చేయాల్సి ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించలేదని టీడీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలను నిలిపివేయాలంటూ కోరింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ, జనసేన సహా మరో ముగ్గురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కలిపి విచారించిన ధర్మాసనం.. టీడీపీ వాదనలతో ఏకీభవిస్తూ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ, జనసేన, మరో ముగ్గురి పిటిషన్లను కొట్టివేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
గత ఏడాది మార్చిలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయి.. ప్రచారం దశలో ఉన్న పరిషత్ ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన పోలింగ్, 9వ తేదీన అవసరమైన చోట రీ పోలింగ్, 10వ తేదీన కౌంటింగ్ చేపట్టేలా నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు.
అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. వైసీపీ, బీజేపీ, జనసేన సహా ఇతర పార్టీలు పరిషత్ ఎన్నికల కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల టీడీపీ నేతలు బరిలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తోంది. ఈ తరుణంలో టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుగుణంగా పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదు రోజుల పాటు చేసిన ప్రచారం, వ్యయం వృథా అవుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.
కాగా, ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ద్విసభ్య ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పరిషత్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 8వ తేదీన జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ దాఖలు చేస్తే.. దానిపై రేపు విచారణ చేసి, ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది.