iDreamPost
android-app
ios-app

ఎన్నికల వాయిదాపై సుప్రింకోర్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎన్నికల వాయిదాపై సుప్రింకోర్టుకు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వాయిదా వేయడంపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్‌ నిర్ణయంపై సుప్రిం కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాకు వెల్లడించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ పదవిపై తమకు గౌరవం ఉందన్న విజయసాయిరెడ్డి.. రాజ్యంగబద్ధంగా ప్రవర్తించని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ లాంటి వ్యక్తిపై ఎలాంటి గౌరవం లేదన్నారు.

బాధ్యతారాహిత్యంగా, పక్షపాతంగా, ఒక పార్టీకి మేలు చేసే విధంగా రమేష్‌కుమార్‌ నిర్ణయం తీసుకున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మునిగిపోతున్న టీడీపీ నావను రక్షించేందుకు రమేష్‌కుమార్‌ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

ఎన్నికల కమిషనర్‌పై గవర్నర్‌కు, రాష్ట్ర పతికి ఫిర్యాదు చేయడంలో తప్పలేదన్న విజయసాయి రెడ్డి.. నిబంధనల మేరకు ప్రవర్తించకపోతే వారిని శిక్షించే అధికారం కోర్టులకు మాత్రమే ఉందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కూడా విజయసాయి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కన్నా నడక.. రాష్ట్రంలో బీజేపీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు.