మా ప్రాణాలకు గ్యారెంటీ ఇస్తారా..? నిమ్మగడ్డకు ఉద్యోగుల సూటి ప్రశ్నలు..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనల, ఆవేదనల మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అద్దాల ఫ్రేమ్‌ రక్షణ మధ్య, భౌతిక దూరం పాటిస్తూ ఈ రోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. తాను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోవడంతో ఎన్నికలపై ప్రజల్లోనూ, అధికారుల్లోనూ నెలకొన్న అపోహలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు ఆటంకం కలిగేలా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న మంకుపట్టుదలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కరోనాకు భయపడి గ్లాస్‌ కవర్‌ షీల్డ్‌ మధ్య మీడియా సమావేశం నిర్వహించిన నిమ్మగడ్డ.. తమను మాత్రం ఎన్నికల విధులు నిర్వహించాలని హుకుం జారీ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు.

ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డిలు నిమ్మగడ్డ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వారి వాదన, ఆవేదన కూడా సహేతుకంగా ఉన్న విషయం ప్రజలు గుర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేరళ, బిహార్, జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు పెరిగిన విషయం వారు గుర్తు చేస్తున్నారు. భారీ సంఖ్యలో అధికారులు వైరస్‌ బారిన పడడం, ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరిగిందంటూ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

పలు రాష్ట్రాలలో అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు, ఏపీలో జరపడంపై ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తారంటూ నిమ్మగడ్డ చేస్తున్న వాదనను ఉద్యోగ సంఘాల నేతలు తోసిపుచ్చుతున్నారు. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని సయమంలో అక్కడ ఎన్నికలు నిర్వహించారని, వ్యాక్సిన్‌ వచ్చి, మొదటి ప్రాధ్యానతగా ఉద్యోగులకు ఇస్తుండగా.. ఆ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తొలిడోసు తీసుకున్నామని, మలి విడత డోసు తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా నిరభ్యంతరంగా, నిర్భయంగా విధులు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరో 45 రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటి వరకు ఎన్నికలు వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టం, ఇప్పుడే నిర్వహించడం వల్ల కలిగే లాభం ఏమిటనే ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వద్ద సమాధానం కరువవుతోంది.

ఒంటెద్దు పోకడలతో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. రేపు తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడదని చెప్పగలరా..? అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలకు గ్యారెంటీ ఉంటుందా..? షూరిటీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇవ్వగలరా..? అని నిలదీస్తున్నారు. తమపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హెచ్చరించడాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌ రెడ్డిలు తీవ్రంగా ఆక్షేపించారు. తమ గోడు వినకుండా.. ప్రాణాలు పోయినా సరే ఎన్నికలు నిర్వహించాలంటే ఒప్పుకోబోమని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే సమ్మెకు కూడా దిగుతామని చెబుతూ.. తమలోని ఆందోళన తీవ్రత ఎలా ఉందో అందరికీ తెలియజేస్తున్నారు. రెండున్నరేళ్లుగా లేని ఎన్నికలు ఇప్పుడు అత్యవసరమయ్యాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను కలిసేందుకు ఇష్టపడని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. వారి ఆందోళన, ఆవేదనను పట్టించుకునే పరిస్థితిలో లేరని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

Show comments