iDreamPost
iDreamPost
ఏ హీరో అయినా ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా పాత్రలు ఎంచుకునే క్రమంలో విచక్షణ చాలా అవసరం. ఏ మాత్రం తొందరపడినా వచ్చే ఫలితానికి చింతించడం తప్ప లాభం ఉండదు. స్థితప్రజ్ఞత అవసరం. అది ఎలా ఉంటుందో ANR నట జీవితంలో కొన్ని ముఖ్యమైన జ్ఞాపకాల్లో తెలుసుకుందాం. 1963లో కెవి రెడ్డి గారు శ్రీ కృష్ణార్జున యుద్ధం తీయాలని తలపెట్టినప్పుడు అందులో కృష్ణుడి వేషానికి ముందు నాగేశ్వరరావు గారినే అడిగారు. రామారావు గారితో అర్జునుడి పాత్ర వేయించాలన్నది ప్లాన్. అంటే అచ్చంగా మాయాబజార్ కు రివర్స్ అన్న మాట. విన్న వెంటనే ఏఎన్ఆర్ షాక్ తో కూడిన ఎక్స్ ప్రెషన్ తో తెలుగు రాష్ట్రంలో కృష్ణుడంటే ఎన్టీఆర్ అనే ముద్ర బలంగా పడిపోయిందని ఇప్పుడు దానికి ఎదురీది తనతో ఈ క్యారెక్టర్ చేయిస్తే సినిమానే దెబ్బ తినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కెవి రెడ్డికి నిజం బోధపడింది. తారకరాముడిని కృష్ణుడిగా మార్చిందే తను. అలాంటిది ఇప్పుడీ సాహసం చేస్తే జనం ఒప్పుకుంటారా. ఛాన్స్ లేదు. అందుకే ఏఎన్ఆర్ చెప్పింది సబబుగా అనిపించి ఆయన మాటే విన్నారు. అర్జునుడిగా అక్కినేనినే ఫిక్స్ చేశారు. సంపూర్ణ రామాయణం తమిళంలో తీస్తున్నప్పుడు అక్కడ రాముడి వేషానికి, సి పుల్లయ్య లవకుశ ప్లాన్ చేసుకున్నప్పుడు లక్ష్మణుడికి ఏఎన్ఆర్ నే అడిగారు. కానీ సున్నితంగా తిరస్కరించారు. ఆ నిర్ణయాలు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. శ్రీ కృష్ణార్జున యుద్ధం రిలీజయ్యాక నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ సినిమా చూసి ఇంకెప్పుడు ఎన్టీఆర్ పక్కన పౌరాణిక పాత్రలు వేయొద్దని చెప్పారట. ఆ సుందరరూపం ముందు ఎంతటి అందగాడైనా దిగదుడుపే అన్నది ఆవిడ అభిప్రాయం. అది ఫలితంలో ఋజువయ్యింది కూడా.
అలాంటిదే అంతకు ముందు మరో సంఘటన ఉంది. 1954లో భరణి సంస్థ ఏఎన్ఆర్ తో విప్రనారాయణ తీయాలని ఏర్పాట్లు చేసుకుంది. అది విన్న ఇండస్ట్రీ జనం చెవులు కొరుకున్నారు. దేవదాసులో తాగుబోతుగా నటించిన మనిషికి అంత భక్తిరస ప్రాధాన్యం ఉన్న వేషం ఇస్తే న్యాయం చేస్తాడా అని కామెంట్లు. పైగా బొత్తిగా దైవ భక్తి లేని ఒక నాస్తికుడితో ఏమిటీ ప్రయోగమని దర్శకుడు రామకృష్ణని నిలదీసిన వాళ్ళు లేకపోలేదు. అయినా ఇద్దరూ వెనుకడుగు వేయలేదు. అక్కినేని దీన్నో సవాల్ గా తీసుకున్నారు. పుస్తకాలు పురాణాలూ చదివారు. భక్త పోతన సినిమాని పదే పదే చూశారు. ఉచ్చారణలో తేడాలు రాకుండా సన్నివేశాలు తీయడానికి ముందు రామకృష్ణతో కలిసి హోమ్ వర్క్ చేసేవారు. ఆ కష్టం ఫలించి ఇద్దరి కెరీర్లో విప్రనారాయణ మైలురాయిగా నిలిచింది
Also Read : Iddaru Asadhyule : తమిళ తెలుగు సూపర్ స్టార్లు ఒకే సినిమాలో – Nostalgia