సర్వమతాల “M” కు పద్మభూషణ్

ప్రతి రిపబ్లిక్ డే కు ముందురోజు వార్తలను ఆసక్తిగా చూస్తారు చాలామంది,కారణం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఇచ్చే “పద్మ”పురస్కార గ్రహీతలెవరని. తెలుసుకున్న తర్వాత మళ్లీ చర్చలు..ఆ తర్వాత ఎప్పుడో అవార్డ్స్ ప్రదానం చేసేరోజు మళ్లీ చర్చలు.. నిజంగా అర్హులా లేక లాబీయింగా అని..మొన్నామధ్య ఈ అవార్ద్స్ ఫంక్షన్ లో సాలుమరద తిమ్మక్క రాష్ట్రపతిని ఆశీర్వదించడం చూసి చెమర్చని కన్నులేదంటే అతిశయోక్తి కాదు.

సరే ఈసారి మన రాష్ట్రం తరఫున ఒక కుగ్రామంలో ఉంటున్న దళవాయి చలపతి రావు గారిని పద్మశ్రీ వరించింది…ఇక మనరాష్ట్రం కాకపోయిన మన రాష్ట్రాన్ని కార్యక్షేత్రంగా చేసుకున్న మరో వ్యక్తిని పద్మభూషణ్ తో సత్కరించబోతున్నారు…ఆయనే “యం”.

ఈ యం ఒక all in one గైడ్ లాంటివాడు.ఉపనిషత్తులు,భగవదీత,ఖురాన్,బైబిల్,జెంద్ అవెస్తా..అన్ని మతాల పవిత్రగ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచంలోని వివిధనగరాల్లో ప్రవచాలిస్తుంటారు.ఒకప్పుడు world space సాటిలైట్ రేడియోలోనూ అనేక ఉపన్యాసాలిచ్చేవాడు.

యంతో ..2012 లో తీసుకున్న ఇంటర్వ్యూ.. …

కుటుంబ నేపధ్యం?

టిప్పు సుల్తాన్ దాడులను ఎదుర్కొనేందుకు నాటి ట్రావెంకూర్ పాలకులు పెషావర్ నుంచి ఫక్తూన్ తెగవారిని రప్పించి అంగరక్షకులుగా నియమించుకున్నారు.కేరళలో స్థిరపడ్డ ఆ తెగలవారి సంతతి.

ముంతాజ్ అలి “యం” ఎలా అయ్యాడు?

అన్ని మతాలూ నావే,ఏ మతానికీ చెందనివాడిని అనుకున్నారేమో,నన్ను సన్నిహితులంతా యం అని పిలిచేవారు.యం కు నేనిచ్చుకున్న నిర్వచనం మనుష్య..మానవీయ విలువలున్నవారంతా మనుష్యులే..అందరూ “యం” లే.

ఆధ్యాత్మిక ప్రస్థానం?

వయసుతో పాటూ ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.19వ ఏట ఇల్లు వదలి బేలూరు రాంకృష్ణ మిషన్ చేరాను..ఆ తర్వాత హిమాలయాలకు కాలినడకన వెళ్లాను..చివరికి బదరీనాధ్ లోని వ్యాసగుహ సమీపంలో నాకు చిన్నతనం నుంచి లీలామాత్రంగా కనిపించే నా గురుదేవుని దర్శనం అయింది..ఆయనకు శుశ్రూష చేస్తూ క్రియా యోగ సాధన చేసాను..విచిత్రం ఏమంటే నా గురుదేవుని పేరు తెలియదు,కానీ బాబాజీ అని పిలుచుకునేవాడిని.గుర్వాజ్ఞననుసరించి హిమాలయాలనుంచి వచ్చిన తర్వాత ఎందరో యోగులను,తత్త్వవేత్తలను కలిసాను..రజనీష్ తో మొదలైన ప్రయాణం జిడ్డు కృష్ణమూర్తి తో ముగిసింది.

కొద్దికాలం జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ ట్రస్టీగా వ్యవహరించా..జేకే మరణానంతరం బయటకు వచ్చేసా..అక్కడే సునంద తో పరిచయం,ప్రణయం.

Read Also: దళవాయి చలపతి రావును పద్మశ్రీ ఎందుకు వరించింది?

కాముడున్న చోట రాముడుండడని అంటారే?

సాధకుడు సంసారంలో ఉండొచ్చు,సంసారాసక్తి అతనిలో ఉండకూడదు,పడవ నీటిలో నిలవొచ్చు కానీ పడవలో నీరు నిలువరాదనే పరమహంస రామకృష్ణులవారు అన్నారు కదా.సూఫీ తత్త్వమే తీసుకుంటే పెళ్లైన వారికే గురుదీక్ష లభిస్తుంది. ఒక సరదా సంఘటన..2007 లో UK లో న్యూ కాజిల్ లో జరిగిన ఒక మతసమ్మేళనం లో నలుగురు కాషాయాంబరధారులను వదలి నన్ను “కర్మ సన్యాస యోగం” గురించి ప్రసంగించమన్నారు.

ఆసక్తి కలిగించే విషయాలు?

అన్నిమతాల తులనాత్మక అధ్యయనం,మ్యాజిక్.

మ్యాజిక్కా?

అవును,ఒక పెద్దబాబా నన్ను చెయ్యి చాపమని చెప్పి విభూది రాల్చడం మొదలు పెట్టాడు,వెంటనే నేనూ ఆయన చేతిలో నా చేతి నుంచి విభూది రాల్చడం మొదలు పెట్టా..ఆ తర్వాత ఆ బాబా దర్శనం మరెప్పుడూ కాలేదు.మ్యాజిక్కులు చేస్తూ ఆధ్యాత్మికత అనే విషయాన్ని నిరసిస్తాను,ప్రజల్లో మానవీయ విలువలు పెంచి ప్రేమతత్త్వాన్ని జాగృతం చేసేవారే నిజమైన ఆధ్యాత్మికవేత్తలు(అంటూ నా చేతిలో ఇంత బూడిద రాల్పి నవ్వేసారు)

మీరు అభిమానించేది?

నా గురువు బాబాజీ లోని ప్రేమతత్వ,కరుణ..వివేకానందుడి నిర్భీతి..జిడ్డు కృష్ణమూర్తిలోని పారదర్శకత,సూటిదనం..

ఇన్ని మతాలను అధ్యయం చేసిన మీరు కొత్తమతం స్థాపించాలనుకుంటున్నారా?

ఏ కొత్తమతం అవసరం లేదు.ఒక మతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సందేశాన్ని గ్రహించి జీవితాలకు అన్వయించుకుంటే సరిపోతుంది.అది మరచి పైపైన చదివినందునే మతవిద్వేషాలు పెరుగుతున్నాయి.

మాన్ అండ్ మిషన్?

మతసామరస్యం కోసం “సత్సంగ్ ఫొండేషన్” స్థాపించాము.”మానవ ఏకత” గురించి ప్రచారం చేస్తున్నాము. కొన్ని గ్రామీణ విద్యాలయాలు స్థాపించి అణగారిన పిల్లలకు విద్య నేర్పిస్తున్నాము.ప్రస్తుతం 150 మంది విద్యార్థులున్నారు.

మీ ప్రవచనాలకు ఫీజు చెల్లించాలా?

అలాంటివేమీ ఉండవు.రాజమహల్లో అయినా గుడిసెలోనైనా ఒకేలా సౌకర్యవంతంగా ఉండగలను.నా కనీసావసరాలకు పెద్దలిచ్చిన ఆస్తి కాస్త ఉంది,నా పుస్తకాల మీద రాయల్టీ వస్తుంది,నా paintings ఎగ్జిభిషన్ అమ్మకాల ద్వారా జరిగిపోతుంది.

మీ సందేశం?

పూర్తి ఎరుకుకతో తెరచిన హృదయం ద్వారా ప్రతి విషయాన్నీ అర్ధం చేసుకొండి. శాంతి,మతాల ఏకత్వం వైపు సాగిపొండి(2000 సంవత్సరం లో భారత ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది సామావేశం లో ఈ విషయమే చర్చించారు)

చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో సదుం మండలంలో సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలం గారు కమిటీ అధ్యక్షులుగా “The Peepal Grove” అనే పాఠశాల స్థాపించారు..స్వేచ్చావాతావరణంలో ఒత్తిడిలేని చదువు అందిస్తున్నారు(ఫీజులుఎక్కువే )పాఠశాల ఆవరణలో రావిచెట్లు ఎక్కువ కాబట్టి ఆ పేరు పెట్టారో, బోధివృక్షం అని పెట్టారో తెలియదు కానీ ఆ పాఠశాల ఆవరణలో ఒకానొక రావిచెట్టు కింద ఉన్న అరుగుపైన కూర్చుని జరిపిన ఇంటర్వ్యూ ఇది … 2006 లో 19 మందితో ప్రారంభమైన ఈ పాఠశాలను అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2006 డిసెంబర్ లో సందర్శించి ఒక రావిమొక్కను నాటారు.

Show comments