Idream media
Idream media
అడుగునా ప్రతిబంధకాలు, అపజయాల తో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ కొత్త సవాళ్ళను ఎదురు కుంటోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కూడా కొత్త అధ్యక్షుల నియామకాలు తల నొప్పిగా మారింది. తెలంగాణలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం 160 మంది అభిప్రాయాలను తీసుకుని ఓ నివేదికను పంపినట్లు ఏఐసీసీ ఇన్‌చార్జి మాణికం టాగోర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అది ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇక మహారాష్ట్రలో బాలాసాహెబ్ థొరాట్ స్థానే కొత్త నేత కోసం అన్వేషణ సాగుతోంది. అర్జునరావ్ జగ్‌తప్‌ను ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్‌సీసీ) చీఫ్‌గా సోనియా నియమించారు. అటు మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, గుజరాత్‌లో అశోక్ చవ్‌దాల స్థానంలో కొత్త వారిని నియమించే పని వేగంగా సాగుతోంది. వచ్చేఏడాది ఎన్నికలు జరిగే అసొం, కేరళల్లో ఇప్పటికే నియమించిన ఇన్‌చార్జ్‌లు- తారిక్ అన్వర్, జితేంద్రసింగ్‌లకు సహాయకంగా ముగ్గురు కార్యదర్శులను కూడా సోనియా నియమించారు. సీనియర్ నేతలతో సంధి చేసుకున్న రాహుల్‌గాంధీ తాజా సమావేశంలో కొన్ని అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
‘2018లో మనం నిజానికి గెలుచుకున్నది ఒక్క ఛత్తీస్‌గఢ్ మాత్రమే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో మనం గెలవలేదు.. బీజేపీ ఓడింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కార్ కొలువుదీరినా కూడా పాలనలో ఆరెస్సెస్సే చొరబడింది. తన అనుచరుల ద్వారా కథ నడిపింది. కమల్‌నాథ్ సీఎం అయినప్పటికీ ఆయన అస్సలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. చివరకు 15నెలల్లోనే ఆయన సర్కార్ కుప్పకూలింది’ అని రాహుల్ వ్యాఖ్యానించడం విశేషం. సచిన్‌పైలట్ తిరుగుబాటును దృష్టిలో ఉంచుకుని- రాజస్థాన్‌లోనూ అసంతృప్తి పదేపదే బయటపడుతోందని, దీని నివారణకు రాష్ట్ర స్థాయిలోనే ప్రయత్నాలు జరగాలని రాహుల్- పరోక్షంగా అశోక్ గెహ్లాట్‌ను ఉద్దేశించి పేర్కొన్నట్లు తెలిసింది. ‘నా వైపునుంచి కూడా సమాచార లోపం జరుగుతోంది. ఇక నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిద్దాం’ అని ఆయన ప్రతిపాదించారు. ‘అధిష్టానం పీసీసీలను విశ్వాసంలోకి తీసుకోవాలి. ఎవరికీ తెలియని ముఖాలను పీసీసీ చీఫ్‌లుగా నియమించరాదు. ఉదాహరణకు ఢిల్లీ పీసీసీకి నియమితుడైన వ్యక్తి అనేకమందికి తెలియదు’ అని హరియాణ మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హూడా అన్నారు. ఈ సమావేశంలో గాంధీ కుటుంబ వీర విధేయులు- ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా పాల్గొనలేదు. రాహుల్ సూచన మేరకే వారు దీనికి దూరంగా ఉన్నారు. దీంతో సీనియర్లు తమ వైఖరులను నిర్మొహమాటంగా వెల్లడించినట్లు తెలిసింది. నామినేషన్ సంస్కృతి తొలగాలని ఆజాద్ సహా అనేకమంది సూచించినట్లు సమాచారం.