iDreamPost
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్" పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, దానికి అనుబంధంగా మరో మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకుని తీవ్రస్థాయిలో ఆందోళనలకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసినట్లు తేల్చారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్" పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, దానికి అనుబంధంగా మరో మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకుని తీవ్రస్థాయిలో ఆందోళనలకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసినట్లు తేల్చారు.
iDreamPost
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ హింసాకాండ ఘటనలో రోజుకో కొత్తవిషయం బయటికొస్తుంది. అభ్యర్థులను ఆందోళనలకు రెచ్చగొట్టింది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులేనని, విధ్వంసానికి కొందరు అభ్యర్థులే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. “సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్” పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి, దానికి అనుబంధంగా మరో మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకుని తీవ్రస్థాయిలో ఆందోళనలకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసినట్లు తేల్చారు. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, నిన్న న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లు పొరుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన అనంతరం.. తొలుత బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అభ్యర్థులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, రోడ్లపై ఆందోళనలు చేశారు. బీహార్ ఉదంతాలతోనే తెలంగాణలోనూ విధ్వంసానికి ప్లాన్ చేశారు. బీహార్ లో జరిగిన ఆందోళనల వీడియోలను కరీంనగర్ కు చెందిన ఆర్మీ అభ్యర్థి శ్రీను ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 1.58 గంటలకు చూసి..”సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్” పేరుతో వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేశాడు. దిల్ సుఖ్ నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న అతను.. ఈ గ్రూపులో ఎనిమిది మంది అభ్యర్థులను అడ్మిన్లుగా చేశాడు. ఆ తర్వాత మరికొన్ని గ్రూపులు క్రియేట్ అయ్యాయి. 8 మంది అడ్మిన్లు “సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్” గ్రూపులో 400 మందిని సభ్యులుగా చేర్చారు. తన పేరు బయటికి రాకూడదన్న ఉద్దేశ్యంతో శ్రీను గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యాడు. బీహార్ మాదిరిగా సికింద్రాబాద్ లోనూ ఆందోళనలు, అల్లర్లు చేయాలని నిర్ణయించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే హింసాకాండను సృష్టించారు.
సాబేర్ అనే అభ్యర్థి జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం అవన్నీ తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందరికీ అందించినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీను, సాబేర్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. మల్కాజ్ గిరికి చెందిన మరో అభ్యర్థి రాజా సురేంద్రకుమార్ వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. అతని పోస్టులతోనే ఆందోళనకారులు రెచ్చిపోయారు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే ముందు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్ కు చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించి.. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో శుక్రవారం జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటకు చెందిన రాకేశ్ మృతి చెందాడు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తంమీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి శనివారం 45 మందిని రైల్వేపోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం నాగోల్‌లోని రైల్వే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు.