పట్టా మార్పిడికి 10 లక్షలు..

  • Published - 07:17 AM, Tue - 25 February 20
పట్టా మార్పిడికి 10 లక్షలు..

ఒక ఉప తహసీల్ధార్ పట్టా మార్పిడికి లక్ష లంచం తీసుకుంటూ ఎసిబికి వలకు చిక్కింది. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కృష్ణ గౌడ్ కధనం ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లా మారెపల్లికి చెందిన రైతు దోమా వెంకటయ్య అదే గ్రామంలో 2016 లో 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో తన పేరు మీద పట్టా మార్పు కోసం తహసీల్ధార్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని అంతకుముందే తానూ కొనుకున్నానని, వెంకట సుబ్బయ్యకు పట్టా మార్పిడి చెయ్యొద్దని ఫిర్యాదు చేశాడు.

ఈ వివాదం గత నాలుగేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ఉపతహసీల్ధార్ గా పని చేస్తున్న జయలక్ష్మి ఆ వివాదాన్ని తానూ పరిష్కరిస్తానని చెప్పి, పట్టా దోమా వెంకటయ్య పేరు మీద మార్చేందుకు 10 లక్షల లంచం డిమాండ్ చేసింది. దానికి ఒప్పుకున్న సదరు రైతు మొదట అడ్వాన్స్ గా లక్ష లంచం ఇస్తానాని చెప్పి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ముందుగా అనుకున్న ప్రకారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే సదరు రైతు వేంకటయ్య నుండి ఉప తహసీల్ధార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి దాడి చేసి ఉప తహసీల్ధార్ భాగోతాన్ని గుట్టురట్టు చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో అవినీతి బాగా ఎక్కువైందని విమర్శలొస్తున్నాయి. రైతుల దగ్గరనుండి రెవిన్యూ అధికారుల డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వానికి తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. వరుసగా వస్తున్న ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒకదశలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రెవిన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సంచలనం రేపిన తహసీల్ధార్ విజయా రెడ్డి హత్యోదంతం ఘటన మరువక ముందే అదే శాఖ కి చెందిన ఉప తహసీల్ధార్ భారీగా లంచం తీసుకుంటూ దొరికిపోవడం చూస్తుంటే రెవిన్యూ డిపార్టుమెంటు అవినీతి మయం అయ్యిందనే వాదనకి బలం చేకూరినట్టయింది.

Show comments