తెలుగుదేశం పార్టీకి నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణ, తిరోగమన దిశగా పయనానికి తోడు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎదురవుతున్న ఘోర పరాజయాలు చంద్రబాబు కంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లున్నాయి. తెలుగుదేశం పార్టీని ఆయనే నడిపిస్తున్నట్లు, దానిని చంద్రబాబు అందుకోలేకపోతున్నట్లుగా ఆయన ఇస్తున్న డైరెక్షన్ కొత్త పలుకుల ద్వారా ఈ వారం రాసిన అక్షర అక్కసుకు దర్పణం. ఈవారం కొత్త పలుకు లో రాధాకృష్ణ రాసిన వ్యాసాన్ని ఒక్కొక్కటిగా విభజించి చూస్తే…
1. తప్పు చేయలేనప్పుడు భయమెందుకు?
అమరావతి కోసం దాదాపు 30 వేల ఎకరాలను సేకరించామని గొప్పలు చెబుతున్న టీడీపీ శ్రేణులు, దాని వెనుక కొందరు పెద్దలు తెలివిగా కొల్లగొట్టిన భూముల వివరాలను మాత్రం బయటకు చెప్పరు. జీవో నెంబర్ 41 మీద సిఐడి విచారణ చేస్తే దానినీ ఎదుర్కోవడానికి చంద్రబాబుకు భయమెందుకు అన్నది మాత్రం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రశ్నించరు. ఒకవేళ చంద్రబాబులు విచారణ చేస్తే ఎలాంటి తప్పులు లేకపోతే సీఐడి కావాలని కేసులో ఇరికించే అవకాశం ఉండదు. అసలే పూర్తి నైరాశ్యం లో ఉన్న పార్టీకి చంద్రబాబు విచారణ ఎదుర్కొనే పక్షంలో మరింత బూస్ట్, సానుభూతి వస్తుందే తప్ప పోయేది ఏమీ ఉండదు. మరి ఇవన్నీ ఆలోచించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబుకు విచారణ ఎదుర్కోవాలని ఓ సూచన చేయాల్సిన అవసరం ఉంది కదా…! అందులోనూ నలభై ఏళ్లపాటు రాజకీయాలు అంటూ చెప్పే వ్యక్తి వ్యవస్థలను ఏమాత్రం గౌరవించకుండా ప్రతిదానికి కోర్టులు తెచ్చుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటనేది కూడా రాధాకృష్ణ ప్రశ్నించాలి.
2. నంద్యాల గెలుపు కు మున్సిపల్ గెలుపు కు సంబంధం ఏమిటి?
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన విజయాలను చూసి రాధాకృష్ణ ఎంత భయపడుతున్నాడో తాను నమ్ముకున్న పార్టీ ఏమైపోతుందో అన్న ఆందోళన ఆయన గుండెల్లో ఎంత ఉందో ఆయన రాతల్లోనే తెలుస్తోంది. నంద్యాల ఉపఎన్నిక ఫలితాలనూ, అప్పట్లో అధికార పార్టీ గా ఉన్న టిడిపి చేసిన ఆకృత్యాలు గురించి ఆ పార్టీ నేతలే గొప్పలు చెప్పుకున్నారు. తమను ఎదుర్కొని లేరని ఎలాగైనా జగన్ ను తొక్కెస్తామంటూ బయటకే చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం, వైసిపి నాయకులు దౌర్జన్యాలు చేశారు అనడానికి ఆధారాలు, సంఘటనలు ఏవీ లేవు. అందులోనూ చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క సంఘటన జరిగినా ఆయన ఊరుకునేవారు కాదు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నంద్యాల ఉప ఎన్నికలకు దీనికి ముడి పెట్టి చెప్పడం దేనికి సంకేతం. అంటే ఇంకా టీడీపీ పని అయిపొయింది అని ఒప్పుకోలేక ఎదుటివారినీ నిదించడం సమంజసమా..?
3. చంద్రబాబు గురించి చెప్పింది నిజం..
ఓవైపు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు చేసిందని చెబుతూనే మరోపక్క టిడిపి నాయకులు కొందరు అమ్ముడుపోయారని, చంద్రబాబు తన నాయకత్వ తీరు మార్చుకోవాలని ఒకే వ్యాసంలో చెప్పడం చూస్తే రాధాకృష్ణ భయాలు, ఆయన మదిలో ఉన్న అసలు లక్ష్యాలు అర్థమవుతాయి. ముఖ్యంగా ఈ వారం వ్యాసం లో చంద్రబాబు గురించి, ఆయన నాయకత్వ తీరు గురించి రాధాకృష్ణ కొద్దిమేర నిజమే చెప్పారు అనిపించింది. చంద్రబాబు తన అవసరానికి నాయకులు వాడుకుంటున్నారని, కష్టపడి పనిచేసిన నాయకులను విస్మరిస్తున్నారని రాధాకృష్ణ చెప్పడం అక్షర సత్యం. చాలామంది నాయకులు కూడా పార్టీలో కష్టపడి పనిచేసినా చివరి నిమిషంలో చంద్రబాబు తమకు హ్యాండ్ ఇస్తారనే కోణంలోనే పని చేయడానికి ఇష్టపడడం లేదు అన్నది చెప్పారు. ఇది చాలా సార్లు, చాలామంది విషయంలో చంద్రబాబు చేసిన మోసం. దీంతోనే ప్రస్తుతం పార్టీ క్రమంగా నాయకులు కార్యకర్తలు సైతం దూరమయ్యే పరిస్థితి వస్తోంది. ఇక చంద్రబాబు నైతిక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారు అన్న విషయాన్నీ రాధాకృష్ణ రాష్ట్రమంతటా మైక్ లో చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ఎదుగుదల మొదలైందే… మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అనైతికత అనే దారిలో అన్నది రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు.
4. వీళ్ళేమి నాయకులు?
టిడిపిలో కీలక నాయకులు ఎవరు మున్సిపల్ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదు అన్నది రాధాకృష్ణ చెప్పిన వాస్తవం. టిడిపి నాయకులు పెద్దగా పని చేసినా ప్రజలు వారిని అభిమానించే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. ఇది రాధాకృష్ణ తెలుసుకోవాల్సిన నిజం. ఇక యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చినరాజప్ప వంటి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనూ టిడిపి బలం పుంజుకోలేదు అన్నది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట. ఆయా ప్రాంతాల్లో యనమల రామకృష్ణుడు బయటికి వచ్చినా, నిమ్మకాయల రాజప్ప ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అది వారికి తెలిసే మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వారు టిడిపికి పనిచేయడం మాట అటుంచితే, వారికే పార్టీ పని చేయాలి అనే ధోరణి వారిది. ఇలాంటి నాయకులను చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నమ్మితే ఇక తెలుగుదేశం పార్టీ మునిగి పోవడానికి సిద్ధంగా ఉన్నట్లే.
5. నమ్ముకున్న వారికి ప్రాణమిచ్చే కుటుంబం అది!
వైయస్ రాజశేఖర్రెడ్డి ఫ్యామిలి అనగానే నమ్ముకున్న వారికి అండగా ఉంటారన్న పేరు ఎప్పటికీ ఉంది. గౌరు వెంకటరెడ్డి విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది అదే. ఎంత కష్టమైనా నష్టమైనా తన అనుకున్న వారి కోసం దేనికైనా సిద్ధపడే తత్వం రాజశేఖర్ రెడ్డిది. అదే తీరు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కు వచ్చింది. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, తనను అనగదొక్కాలని చూసేవారు ఢిల్లీని ఏలిన వారైనా వారి మీద తిరగబడడం వైఎస్ ఫామిలీ కి ఉన్న తెగువ, తమపై తమకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. దీనిని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కరెక్టుగానే క్యాచ్ చేశారు. అలాంటిది చంద్రబాబుకు లేదని చెప్పడం ద్వారా చంద్రబాబు లోని లోపాలను ఈ వారం వ్యాసం లో చెప్పిన రాధాకృష్ణను అభినందించకుండా ఉండలేం.