iDreamPost
iDreamPost
దేశంలో ఇప్పటికే గత ఏడాది లాక్ డౌన్ ప్రభావం తగ్గలేదు. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదు వలసకూలీలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేదు. సామాన్య ప్రజలు, ప్రభుత్వాలు కూడా కుదేలయిన నాటి పరిణామాల తాకిడి తగ్గలేదు. ఈలోగా మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ వార్తలు వస్తున్నాయి. మే 2 తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్రం లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాంతో అనేక రంగాల్లో వలస కూలీలు, వివిధ పరిశ్రమల యజమానులు కూడా ఇప్పటి నుంచే ఆందోళనకు గురవుతున్నారు. హఠాత్తుగా నిర్ణయం తీసుకుంటే గత ఏడాది మాదిరిగా మరోసారి అదే అనుభవం ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు
వాస్తవానికి ఇటీవల మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్ డౌన్ అంచనాలను కొట్టిపారేయలేదు. పైగా అది అంతిమ నిర్ణయం అని పేర్కొన్నారు. దాంతో కరోనా రానురాను తీవ్రమవుతున్న తరుణంలో తుది దశలో ఇలాంటి నిర్ణయాలు అనివార్యమే అనే వారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో పది రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది తాజాగా కర్ణాటకలో 14 రోజుల లాక్ డౌన్ విధించారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా పాక్షికంగా నిబంధనలు అమలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా పరిమిత సమయాల్లోనే వ్యాపారాలు నడుపుతున్నారు.
Also Read : కరోనా సునామీ : మరో రాష్ట్రంలో లాక్‌డౌన్
ఇలాంటి స్థితిలోనూ కరోనా కంట్రోల్ అవుతున్నట్టు కనిపించడం లేదు. పైగా ఐఐటీ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే నెల చివరి వరకూ ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని తేల్చేశారు. ఆ తర్వాత కూడా ఏమేరకు నియంత్రణ ఉంటుందనేది నేటికీ అంతుబట్టడం లేదు. దాంతో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ పేరుతో మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనలో కేంద్రం ఉందనే వాదన హల్ చల్ చేస్తోంది. అదే జరిగితే మరోసారి వలస కూలీల అవస్థలను చూడాల్సి ఉంటుంది. దానికి తోడుగా భవన నిర్మాణ రంగం సహా వివిధ పరిశ్రమల్లో కూలీల కొరత ఏర్పడి ఎక్కడిక్కడ సర్వం నిలిచిపోయే ప్రమాదం దాపురిస్తుంది. దాంతో కొందరు పరిశ్రమల యజమానులు వలస కూలీలో కోసం సొంతంగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటుండడం విశేషం.
తెలుగు రాష్ట్రాల వరకూ కరోనా కోసం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉండదనే అంచనాలో ముఖ్యమంత్రులున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే నిర్ణయాలున్నాయి. ఏపీలోనూ పరీక్షల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే వాటిని వాయిదా వేసి కరోనా కర్వ్ కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించే యోచనలో ఉన్నారు. ఏమయినా సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా పడిపోయిన ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకోకముందే మరోసారి అలాంటి వాతావరణం ఏర్పడడంతో అంతా కలవరపడుతున్నారు.
Also Read : వైరస్ కట్టడికి మినీ లాక్ డౌన్లు