అల్లూరి పోరాటానికి వందేళ్లు

స్వాతంత్య్ర పోరాటంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర చిరస్మరణీయం. అమాయకులైన గిరిజనులపై బ్రిటిష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా మన్యం ప్రజలను పోరాటాలకు సిద్ధం చేసిన ఆయన అహింసాయుత పోరాటాలతో లాభంలేదని గ్రహించి సాయుధ పోరాటానికి సిధ్దమయ్యారు. ఆ పోరాటానికి ఆయుధ సేకరణ కోసం పోలీస్ స్టేషన్లపై దాడులకు వ్యూహరచన చేశారు. తొలిసారి 1922 ఆగస్ట్ 22న విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. అల్లూరి పోరాటంలో అతి కీలకమైన ఆ ఘట్టానికి నేటితో 99 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం అల్లూరిపై పోస్టల్ శాఖ ప్రత్యేక స్టాంప్ విడుదల చేయనుంది.

ఆదివాసీల విముక్తే లక్ష్యం

అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు తొలి సంతానంగా 1897 జులై నాలుగో తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో సీతారామరాజు జన్మించారు. విశాఖ, పిఠాపురం, నర్సాపురం, భీమవరం, రాజమండ్రి, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం విశాఖ మాన్యానికి వచ్చిన అల్లూరి ఆదివాసీలను బ్రిటీషర్లు శ్రమ దోపిడీకి గురిచేస్తుండటాన్ని గమనించారు. లంబసింగి ఘాట్ రోడ్డు నిర్మాణంలో ఆదివాసీలతో పనిచేయించుకుంటున్నా వారికి వేతనాలు గానీ, కనీసం ఆహారం గానీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తహసీల్దార్ బాస్టియన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్రిటిష్ అధికారులు దాన్ని పట్టించుకోకపోగా అల్లూరిపైనే ఎదురు కేసు పెట్టారు. దాంతో గిరిజన హక్కుల పరిరక్షణకు, పోడు నిషేధానికి వ్యతిరేకంగా మన్యంలోనే ఉండి పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన బ్రిటిషర్లు అల్లూరిని నర్సీపట్నంలో గృహ నిర్బంధంలో ఉంచారు. తర్వాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టులో ప్రవాసంలో ఉంచారు. అయితే 1922 జూన్లో పోలవరం డిప్యూటీ కలెక్టర్ ఫజులుల్లాఖాన్ సాయంతో ప్రవాసం నుంచి తప్పించుకున్నారు.

సాయుధ పోరాటానికి సంకల్పం

ఈ పరిణామాల నేపథ్యంలో సీతారామరాజు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. గంటం దొర, మల్లుదొర, ఎండుపడాల్ తదితర గిరిజన పెద్దలను సమీకరించారు. గిరిజన యువకులకు గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు. తమ పోరాటానికి అవసరమైన ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడులకు వ్యూహరచన చేశారు. ఆ మేరకు 1922 ఆగస్టు 22న తొలి దాడి చింతపల్లి పోలీస్ స్టేషన్ పై జరిపారు. అక్కడి పోలీసులను బంధించి 11 తుపాకులు, 1390 తూటాలు, 14 బాయినెట్లు, 5 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్ డైరీలో ఆ వివరాలు నమోదు చేసి అల్లూరి స్వయంగా సంతకం చేశారు. ఆ మరుసటిరోజు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పైన, 24న రాజవొమ్మంగి స్టేషన్ పైన దాడి చేసి పెద్ద సంఖ్యలో తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి బృందం జరిపిన వరుస దాడులు బ్రిటిష్ పాలకులకు వణుకు పుట్టించాయి. ఇద్దరు ప్రత్యేక అధికారుల నేతృత్వంలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అయినా వెనక్కి తగ్గని అల్లూరి అదే ఏడాది ఆక్టోబరు 15న అడ్డతీగల పోలీస్ స్టేషన్, సబ్ మేజిస్ట్రేట్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు బ్రిటిష్ ప్రత్యేక అధికారులు మరణించారు. ఇలా రెండేళ్లు బ్రిటీషర్లను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి చివరికి 1924 మే ఏడో తేదీన బ్రిటీషర్లకు చిక్కి అమరుడయ్యారు. ఆనాటి సాయుధ పోరాటానికి తొలి వేదిక అయిన చింతపల్లి పోలీస్ స్టేషన్ భవనం ఇప్పటికీ ఉంది. సీఆర్పీఎఫ్ ఆయుధాగారంగా ఉపయోగపడతోంది.

Show comments