నేరాలను అరికట్టాలంటే పంచాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే: DGP

  • Author singhj Published - 11:48 AM, Tue - 22 August 23
  • Author singhj Published - 11:48 AM, Tue - 22 August 23
నేరాలను అరికట్టాలంటే పంచాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే: DGP

నేరాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. తప్పులు చేసిన వారికి కోర్టులు కఠిన శిక్షలు వేస్తున్నా.. నేరాలు పెరుగుతున్నాయే గానీ తగ్గడం లేదు. ఉత్తర్ ప్రదేశ్​లోనూ క్రైమ్ రేట్ ఎక్కువగానే ఉంది. నేరాలను అదుపు చేసేందుకు అక్కడి పోలీసు యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో యూపీ డీజీపీ విజయ్ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో హత్యలు, దోపిడీలు, దొంగతనాలను అరికట్టాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన ఆయన.. రాత్రిపూట జరిగే నేరాలను తగ్గించాలని కోరారు.

ఉత్తర్​ ప్రదేశ్​లో ఎక్కువగా అమావాస్య రోజుల్లోనే నేరాలు జరుగుతున్నాయని సర్క్యులర్​లో డీజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆ లేఖతో పాటు పోలీసులకు హిందూ పంచాంగాన్ని కూడా ఆయన పంపారు. అమావాస్యకు ఒక వారం ముందు.. ఓ వారం తర్వాత నేరాలు అధికంగా జరుగుతున్నాయని అందులో వివరించారు. పంచాంగం సాయంతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. అమావాస్య తిథి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించడం గమనార్హం. నేరాలను సమర్థంగా నిరోధించడం పోలీసుల ప్రధానాంశాల్లో ఒకటని సర్క్యులర్​లో డీజీపీ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని సామాన్య పౌరులకు భద్రతతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు డీజీపీ విజయ్ కుమార్. దీంట్లో భాగంగా రాత్రి పూట పెట్రోలింగ్ మరింత సమర్థంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు తమ భద్రత మీద మరింత విశ్వాసం కలుగుతుందని డీజీపీ వివరించారు. రాష్ట్రంలోని క్రిమినల్ హాట్​స్పాట్​లను గుర్తించాలని, నేర ఘటనల్ని మ్యాప్ చేయాలని ఆదేశించారు. వీటి ద్వారా ప్రణాళికాబద్ధంగా నేరాలను అరికట్టాలని సూచించారు. అయితే పంచాంగాన్ని ఫాలో అవ్వాలంటూ డీజీపీ సూచనలు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేరస్థులు ముహూర్తాలు, పంచాంగాలను చూసి నేరాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Show comments