Dharani
Dharani
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ్ ఇండస్ట్రీలోనే అగ్రకథానాయకుడగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం ఆయన సొంతం. స్టార్ హీరో అయినప్పటికి సింప్లిసిటికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. కొందరు హీరోల మాదిరి తెర మీద మాత్రమే కాక నిజ జీవితంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ.. రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటాడు విజయ్. కానీ సేవా కార్యక్రమాలకు మాత్రం తప్పక హాజరవుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ తమిళనాడులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆయన చేసిన పనికి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అంటే..
తమిళనాడు 10,12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం జరుపుతూ.. విజయ్ పీపుల్స్ మూమెంట్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10, 12వ తరగతిలొ అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ పీపుల్స్ మూమెంట్ తరపున ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్స్ అందజేస్తారు.ఈ వేడుక శనివారం ఉదయం చెన్నైలోని నీలాంగరైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. దీనికి విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో 600/600 మార్కులు సాధించిన నందిని అనే విద్యార్థినికి ప్రోత్సాహకం అందించడమే కాకుండా.. ప్రత్యేంగా డైమండ్ నెక్లెస్ బహుమతిగా అందించారు విజయ్. అనంతరం విద్యార్థులందరికీ ఆయన చేతుల మీదుగా హుమతులు అందజేశారు. విజయ్ దళపతి, విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. విజయ్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
అనంతరం ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ.. చదువు ఒక్కటే పూర్తి విద్య కాదని.. మన చుట్లూ జరిగే అంశాల గురించి తెలుసుకోవడం కూడా విద్యాభ్యాసం కిందకే వస్తుందనే విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ఈ సందర్భంగా విజయ్ సూచించారు. “నేను చాలా సినిమా వేడుకలలో మాట్లాడాను.. కానీ ఇలాంటి కార్యక్రమంలో మాట్లాడడం ఇదే తొలిసారి. నేను తెలివైన స్టూడెంట్‌ని మాత్రం కాదు. స్కూల్, కాలేజీలకు వెళ్లి చదువుకోవడం మాత్రమే కాదు..జీవితానికి అవసరమయ్యే అన్ని అంశాలు నేర్చుకోవాలి. స్కూల్లో చదివిన పాఠాలు మర్చిపోయినా.. జీవితంలో నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. జీవితంలో మీరు ఆలోచించే విధానం ఎప్పటికీ మీతోనే ఉంటుంది. డబ్బు పోయినా పర్లేదు.. కానీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి” అంటూ చెప్పుకొచ్చారు విజయ్.