Dharani
Dharani
బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దక్షిణాదిలోనే కాక నార్త్‌లో కూడా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభాస్ సాహో, రాధే శ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు. కానీ అవేవి ఆశించిన మేర విజయం సాధించలేదు. ఇక తాజాగా ఆదిపురుష్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల మాట ఎలా ఉన్నా సినిమా మీద మాత్రం బోలేడు విమర్శలు వచ్చాయి. దర్శకుడు ఓంరౌత్ రామయణాన్ని భ్రష్టు పట్టించాడని ప్రేక్షకులు మండి పడ్డారు.
ఆదిపురుష్ రిజల్ట్ సంగతి పక్కకు పెడితే ప్రభాస్ చేతిలో మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో కేజీఎఫ్ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్ని ఉన్నాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. దానిలో భాగంగా సలార్ టీజర్‌ను ఈ రోజు ఉదయమే అనగా జూలై 6న విడుదల చేశారు. టీజర్ విడుదల కోసం ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక వారి అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా టీజర్ కట్ చేసింది చిత్ర బృందం. డార్లింగ్ ప్రభాస్‌ను ఏకంగా డైనోసర్‌తో పోలిస్తూ.. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ లుక్‌లో ఎలివేట్ చేస్తూ.. కట్ చేసిన టీజర్.. సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో… ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండనుందో క్లారిటీ ఇచ్చేసింది. ఐదు భాషల్లో కట్ చేసిన టీజర్.. గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది వ్యూస్ కొల్లగొడుతూ.. పాత రికార్డులను బద్దలు కొడుతుంది.
టీజర్ విడుదల తర్వాత సలార్ సినిమా స్టోరిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘సలార్’ టైటిల్‌కు అర్థం ఏంటి అని తెగ సర్చ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా వస్తుంది. టైటిల్ పోస్టర్ మీద హింసాత్మకమైన వ్యక్తులు ఒక మనిషిని హింసాత్మకమైన వ్యక్తి అని పిలుస్తుంటారు. అతనే ‘సలార్’ అంటూ టైటిల్ ఎంత పవర్‌పుల్ అనేది చెప్పకనే చెప్పారు. సలార్ టీజర్ విడుదల తర్వాత.. ఈ టైటిల్‌కు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీకి మధ్య ఉన్న బంధం తెర మీదకు వచ్చింది.
పాతబస్తీలో ఎంఐఎం పార్టీ పుంజుకోవడంలో అసదుద్దున్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ పాత్ర ఎంతో ఉంది. రజాకార్ అధినేత ఖాసీం రజ్వీ తర్వాత.. అసదుద్దీన్ తాత వాహెద్ అలీ ఖాన్ నుంచి అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఎంఐఎం పగ్గాలు చేపట్టారు. ఆయనను అక్కడి ప్రజలు గౌరవంగా సలార్ అని పిలిచేవారు. ఇక ప్రభాస్ నటించిన ఈ చిత్రం టైటిల్ కూడా ‘సలార్’ కావడంతో ఎంఐఎం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పాతబస్తీ నాయకుడైన సలావుద్దీన్‌ను మరోసారి గుర్తు చేసినందకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈయన 1984 నుంచి 1999 వరకు వరుసగా ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇక సలావుద్దీన్ తర్వాత ఆయన పెద్ద కుమారుడు.. అసదుద్దీన్ 2004 నుంచి వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక సలార్ సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా రెండు పార్ట్స్‌గా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఈ ఏడాది విడుదల కాబోతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సలార్ ఎలా వేటాడుతాడో చూడాలి.