సినిమా ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ ఆరోపణలు నిజమో.. కాదో కానీ వారి ఇద్దరి పేర్లు మాత్రం ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతాయి. తాజాగా ఓ స్టార్ ప్లే బ్యాక్ సింగర్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాపై సంచలన ఆరోపణలు చేసింది. ఇళయరాజా కారణంగానే తన సింగింగ్ కెరీర్ నాశనమైందంటూ చెప్పుకొచ్చింది. ఒకే ఒక్క కారణంతో ఇళయరాజా నాకు అవకాశాలు ఇవ్వలేదని ఆ సింగర్ వాపోయింది. మరి ఆ సింగర్ ఎవరు? ఆమెకు ఇళయరాజా అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇళయరాజా.. మ్యూజిక్ మాస్ట్రోగా ఇండియన్ సినిమా చరిత్రలోనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇక ఆయన సంగీత దర్శకత్వం కోసం ఎందరో డైరెక్టర్లు క్యూ కడుతుంటారు. ఇక ఆయన వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంటారు. ఆయనపై ఇప్పటి వరకు ఆరోపణలు చేసిందీ లేదు. కానీ తాజాగా ఓ ప్లే బ్యాక్ సింగర్ ఇళయరాజా వల్లే తన కెరీర్ నాశనమైందని సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండియన్ ప్లే బ్యాక్ సింగర్ మిన్మిని ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏంటంటే?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘రోజా’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నారు. రెహమాన్ కి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఇక రోజా సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటను సింగర్ మిన్మిని చేత పాడించారు రెహమాన్. ఈ విషయం కాస్తా ఇళయరాజాకు తెలియడంతో.. తన దగ్గర పాడుతూ.. మళ్లీ వేరే చోట ఎందుకు పాడుతున్నావ్ అని ఇళయరాజా మిన్మిని అడిగాడట. తన దగ్గరే పాడాలని ఇళయరాజా అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. దీంతో తాను ఏడ్చానని.. అయితే ఇదంతా ఒక రికార్డింగ్ రూమ్ లో మైక్ ఆన్ లో ఉన్నప్పుడు జరగడంతో.. అక్కడున్న వాళ్లంతా ఆమె ఏడుపు విన్నట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చినట్లుగా తెలిపింది.
ఇక ఈ సంఘటన తర్వాత తనను పాటలు పాడేందుకు ఇళయరాజా పిలవలేదని మిన్మిని గుర్తుచేసింది. ఇక ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి అందరు తప్పుగా అనుకోకూడదనే ఇన్నాళ్లు ఈ విషయం చెప్పలేదని సింగర్ మిన్మిని అన్నారు. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తన వాయిస్ కోల్పోవడంతో.. సింగింగ్ మానేయాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. అయితే కొన్నాళ్లకు ఆమె వాయిస్ పొంది.. 2015లో కమ్ బ్యాక్ ఇచ్చారు. మరి ఈ ఆరోపణలపై ఇళయరాజా ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.