iDreamPost
iDreamPost
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి ఫాలోయింగ్ మైంటైన్ చేసిన రాజశేఖర్ హీరోగా రూపొందిన శేఖర్ వచ్చే నెల 20న విడుదల కాబోతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సరైన డేట్ కోసం వేచి చూసిన యూనిట్ ఫైనల్ గా తేదీని లాక్ చేసుకుంది. అయితే సర్కారు వారి పాట రిలీజైన వారానికే రావడం కొంత రిస్క్ అయినప్పటికీ అంతకన్నా ఆప్షన్ లేదు. ఆ తర్వాత వారం కూడా ఎఫ్3 లాంటి క్రేజీ మూవీస్, జూన్ మొత్తం షెడ్యూల్ చేసుకున్న సినిమాలతో ప్యాక్ అయిపోవడంతో ఎట్టకేలకు ఈ మార్గం చూసుకుంది. రిస్క్ ఉన్నప్పటికీ ఇప్పటికే జరిగిన ఆలస్యం వల్ల బజ్ అంతగా లేదు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
శేఖర్ మలయాళం హిట్ మూవీ జోసెఫ్ ఆధారంగా రూపొందింది. రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటు చేసుకునే అనూహ్య పరిణామాలు ఒక మెడికల్ మాఫియా గుట్టు రట్టు చేసేందుకు ప్రేరేపిస్తాయి. కానీ ప్రమాదకరమైన ఈ ప్రయాణం ఉహించని మలుపు తీసుకుంటుంది. అయినా కూడా అతను వెనుకడుగు వేయడు. తర్వాత ఊహించని క్లైమాక్స్ తో కథ ముగుస్తుంది. తొలుత వేరే దర్శకుడు అనుకున్నప్పటికీ ఫైనల్ గా జీవితనే సినిమాను డైరెక్ట్ చేసి పూర్తి చేయడం విశేషం. లక్ష్మి భూపాల మాటలు అందించగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. అంతా బాగానే ఉంది కానీ రాజశేఖర్ కు హిట్ చాలా కీలకం.
నిన్న ఓ నిర్మాత జీవిత దంపతుల మీద ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు చేయడం, కోర్టు వారెంట్ ఇష్యూ చేయడం లాంటి పరిణామాల తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ చెప్పడం గమనార్హం. గరుడవేగాకు సంబంధించిన లావాదేవీలు ఇంకా క్లియర్ కాలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. మార్కెట్ బాగా తగ్గిపోయిన రాజశేఖర్ కు బడ్జెట్ ఎక్కువ పెట్టి తీసిన కల్కి ఫ్లాప్ కావడం మార్కెట్ ని ఇంకాస్త తగ్గించింది. సోలో హీరోగా ప్రేక్షకులు ఆయన్ను చూసేందుకు సిద్ధంగా లేరని అర్థమైపోయింది. పూర్తిగా వయసు మళ్ళిన పాత్రలో తెల్లని గెడ్డంతో కనిపిస్తున్న రాజశేఖర్ ఇకపై కూడా ఇలాంటి పాత్రలే చేస్తారో లేదో ఈ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది