టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అకాల మరణం అందరినీ కలచి వేసింది. ఈనెల 18న అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. జూన్ 28న పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన శిష్యులు సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ ముందుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ జ్ఞాపకార్థం ఏటా ఆయన పేరిట జాతీయ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు.
రాకేశ్ మాస్టర్ అకాల మరణ వార్తను ఆయన శిష్యులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయేంత వరకు ఏదోక రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని మరో ఎత్తుకు తీసుకెళ్లిన గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్లలో రాకేశ్ మాస్టర్ కూడా ఒకరు. ఆయన శిష్యులు సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఒక గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఆయన మరణం తర్వాత శిష్యులు అంతా ఒకటయ్యారు.
ఆయన కుటుంబం, పిల్లల బాధ్యత తమదే అంటూ ముందుకొచ్చారు. అంతేకాకుండా ఆయన పేరిట కూడా ఒక గొప్ప పని చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. శేఖర్ మాస్టర్ సహకారంతో రాకేశ్ మాస్టర్ పేరిట ఏటా జాతీయ పురస్కారం అందజేస్తామని సత్య మాస్టర్ ప్రకటించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. అలాగే రాకేశ్ మాస్టర్ కుటుంబానికి తమకు చేతనైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన శిష్యులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల మధ్య ఈ కార్యక్రమం సాగింది.