ఎవరికో భయపడి ఈగల్ రిలీజ్ డేట్ మార్చుకోలేదు.. ఎప్పుడైనా ఈగల్ కి తిరుగులేదు: నిర్మాత

TG Vishwa Prasad On Eagle Movie: ఈగల్ సినిమాను వాయిదా వేయడంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. వాటికి నిర్మాత గట్టిగా బదులిచ్చారు.

TG Vishwa Prasad On Eagle Movie: ఈగల్ సినిమాను వాయిదా వేయడంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. వాటికి నిర్మాత గట్టిగా బదులిచ్చారు.

తాను ఎవరికీ భయపడి రిలీజ్ డేట్ మార్చుకోలేదని, కేవలం పరిశ్రమలోని ఆరోగ్యకరైమన వాతావరణాన్ని ఆశించి మాత్రమే మిత్రులు కోరిక మేరకు, తమ హీరో రవితేజతో చర్చించి మరీ ఆయన ఆలోచనలను అనుసరించి మాత్రమే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9వ తేదీకి ఈగల్ రిలీజ్ డేట్ మార్చుకున్నట్టుగా సుప్రసిద్ధ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఐ డ్రీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అందరి కన్నా ముందుగానే తాము రిలీజ్ డేట్ ప్రకటించామని, పైగా థియేటర్ల నిర్ణయం కూడా ముందస్తుగానే జరిగిందని కూడా ఆయన అన్నారు.

260 థియేటర్లు కన్ఫార్మ్ అయ్యాయి, ఇంకా మరో 90 థియేటర్లు సులభంగా తమ పంపిణీదారులు నిర్ధారించే పరిస్థితి ఉన్నప్పటికీ అన్ని వైపులా ఆలోచించి, అందరి ఆలోచనలను మన్నిస్తూనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. అంతే గానీ, థియేటర్లు దొరకవేమోననే భయంతోనో, లేక పోటీకి బెదిరిపోయే రిలీజ్ డేట్ మార్చుకోలేదని కూడా విశ్వ తెలియజేశారు. పైగా, ఈగల్ ఇప్పుడొచ్చినా, అప్పుడొచ్చినా అటువంటి స్ట్రాంగ్ కంటెంట్, రవితేజ గారిలాటి మాస్ హీరోతో సినిమాకి ఎటువంటి ఢోకా ఉండనే ఉండదన్న విశ్వాసాన్ని కూడా విశ్వప్రసాద్ వ్యక్తం చేయడం విశేషం. రవితేజ గారికున్న ప్రత్యేకత ఏంటంటే అని చెబుతూ, ఆయన కుండే అపారమైన అభిమానులతో పాటు అందరి హీరోల అభిమానులు కూడా ఆయనని అమితంగా అభిమానిస్తారని అన్నారు.

దిల్ రాజు గుంటూరు కారం సినిమా కోసం థియేటర్లన్నంటినీ బుక్ చేసేసుకున్న కారణంగా థియేటర్ల కొరత ఏర్పడవచ్చనే ముందుచూపుతోనే రిలీజ్ డేట్ మార్చుకున్నారని వినిపిస్తోందనే ప్రశ్నకు సమాధానంగా టీజీ.. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఉందని, నెగెటివ్ పబ్లిసిటీ పాజిటివ్ పబ్లిసిటీ అనేవి ప్రతీ సినిమాకి న్యాచురల్ గానే ఉంటుంటాయని చెబుతూ, నిజానికి దిల్ రాజు సంక్రాంతి రిలీజుల విషయంలో ఒత్తిడి, ఉద్రిక్తత లేకుండా చూడాలని నిజాయితీగా వ్యవహరించి, అందరినీ సంప్రదిస్తూ వచ్చారని కూడా దిల్ రాజును ఆయన మెచ్చకున్నారు. ఏ సినిమాకుండాల్సింది ఆ సినిమాకి ఉందనీ, హనుమాన్ హిందీలో రిలీజ్ చేసే డేట్ బట్టి డేట్ మార్చుకోవడానికి వాళ్ళకి వీలు పడలేదని, సైంధవ్ వెంకటేష్ గారికి 75వ చిత్రం కావడం, గుంటూరు కారం చిత్రం కూడా విడుదల చేయాల్సిన అవసరం అన్నీ కలసి ఈసారి సంక్రాంతి సీజన్లో ఈ విధమైన వాతావరణం నెలకొందని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు.

నిజానికి ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను ముగించుకున్న ఈగల్ చిత్రం అన్ని విధాల సంక్రాంతికి తాము ముందుగా అనుకున్న జనవరి 13వ తేదీకి వచ్చేసే సౌలభ్యం, పరిస్థితి పుష్కలంగా ఉన్నాయని అన్నారు. 260 థియేటర్లు కన్ఫార్మ్ అయిపోయి, మరో 90 థియేటర్లు కూడా తాము గట్టిగా పట్టుబడితే ఈరోజున ఏర్పాటు అయిపోయుండేవని, కానీ ఈరోజున థియేటర్ల నిర్ధారణ జరుగుతుండగా అందులో తాము కూడా భాగం కావడం తనకి, తమ హీరో రవితేజకి ససేమిరా లేదని చెప్పారు. అటువంటి పరిస్థితిని ప్రోత్సహించడం ఇష్టం లేకనే తాను మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం పోస్టర్ కూడా సలార్ విడుదలవుతున్న తరుణంలో విడుదల చేయలేదని ఆయన గుర్తు చేశారు. సంక్రాంతికి ప్రభాస్, మారుతి కాంబినేషన్ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తానని కూడా తెలియజేశారు.

Show comments