Dharani
Dharani
కేంద్ర ప్రభుత్వం.. 2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది తెలుగు చిత్రాలు.. జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. 69 ఏళ్ల అవార్డుల చరిత్రలో తొలిసారి.. తెలుగు హీరో.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పురుస్కారం అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఉత్త నటుడి అవార్డు దక్కించుకున్నాడు. అలియా భట్ (గంగూబాయి), అలానే మిమి సినిమాలో ఉత్తమ నటన కనబర్చినందుకు గాను కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఈ సారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు ఎక్కువ అవార్డులు సాధించాయి. తెలుగు చిత్రాలకు 11 పురస్కారాలు దక్కాయి. అయితే వాటిలో 6 అవార్డులు ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి రావడం విశేషం.
కేంద్ర ప్రకటించిన అవార్డుల జాబితాలో ఉన్న చిత్రాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు ఇస్తోంది 2021లో విడుదలైన చిత్రాలకు. కానీ ఆశ్చర్యంగా కేంద్రం ప్రకటించిన జాబితాలో.. ఎక్కువ శాతం అవార్డులు పొందిన చిత్రాలు.. 2022లో విడుదలైనవే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ (2022, మార్చి), రాకెట్రీ (2022, జూలై), గుంగూబాయ్ కాఠియావాడి (2022, ఫిబ్రవరి) నెలలో విడుదలయ్యాయి.
వీటిలో గంగూబాయి చిత్రంలో ఉత్తమ నటన కనబరిచినందుకు గాను ఆలియాకు ఉత్తమ నటి అవార్డు, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకైతే ఏకంగా ఆరు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దీనిపై నెటిజనులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాంటప్పుడు 2022 లో విడుదలైన కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక దీని గురించి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి నీర్జా శేకర్‌ని పలువురు ప్రశ్నించారు.
ఈక్రమంలో నీర్జా శేఖర్ బదులిస్తూ.. ‘‘జాతీయ చలన చిత్ర అవార్డుల నిబంధనల ప్రకారం.. ఏదైనా సినిమా జ్యూరీ పరిశీలనకు అర్హత పొందాలంటే.. 2021, జనవరి, 1 నుంచి 2021, డిసెంబర్ 3 మధ్య కాలంలో సదరు చిత్రం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధ్రువీకరించబడాలి. దానికి అనుగుణంగానే.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో భాగంగా.. 2021 సంవత్సరంలో సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ పొందిన సినిమాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించాము. ట్రిపుల్ ఆర్, గంగూబాయి కాఠియావాడి, రాకెట్రీ వంటి చిత్రాలు 2021లోనే సెన్సార్ సర్టిఫికెట్ పొందాయి. అందుకే వీటిని పరిగణించాము’’ అని చెప్పుకొచ్చారు.