నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే: మంచు లక్ష్మి

మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోహన్‌ బాబు కుమార్తెగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. హీరోయిన్‌, విలన్‌, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించింది. నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇక బుల్లితెర మీద మంచి షోలు చేసి.. ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అందం, ప్రతిభ ఉన్నప్పటికి ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదన్నది వాస్తవం. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే.. సోషల్‌ మీడయాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది మంచు లక్ష్మి. యోగా, డ్యాన్స్‌, పర్సనల్‌ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ.. అభిమానులను పలకరిస్తుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో మంచు లక్ష్మి మీద ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. కానీ ఆమె దాన్ని సీరియస్‌గా పట్టించుకోరు. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి తప్పవు అని భావిస్తారు. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తెగ వైరలవుతోంది. దీనిలో ఆమె తన వ్యక్తిగత జీవితం, సినిమాలు, ఇండస్ట్రీలో ఉండే పరిస్థితుల గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

తన తమ్ముడు మనోజ్ రెండో పెళ్లి తరువాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దీనిలో భాగంగా తన భర్త అమెరికాలో ఉంటే తాను ఇండియాలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాలు వివరించింది. మంచు లక్ష్మి 2006 లో చెన్నై కి చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌ అనే ఐటీ ప్రొఫెషనల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా ఒక బిడ్డ జన్మించింది. అయితే ప్రస్తుతం మంచు లక్ష్మి భర్త అమెరికాలో ఉంటుండగా.. ఆమె మాత్రం ఇండియాలో ఉంటుంది. ఈ క్రమంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

‘‘మా పెళ్లి తర్వాత మేం అమెరికా వెళ్లాం. కానీ పిల్లలు కావాలనుకున్న తర్వాత.. ఇండియా వచ్చాం. పిల్ల్లని ఇక్కడ మన దేశంలో పెంచినట్లు అమెరికాలో పెంచలేము. అందుకే నేను ఇండియా వచ్చాను. మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉంటారు. కానీ ప్రతి రెండు నెలలకొసారి ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు. ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కానీ.. అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటారు. గత రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పాపని తీసుకుని అమెరికా వెళ్లారు’’ అని తెలిపింది.

‘‘ఎవరికి నచ్చిన పని వాళ్లు చేయాలని భావించాం. కరోనా తర్వాత మా ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్ని రోజులుంటామో తెలియదు.. అందుకే ఉన్నన్ని రోజులు మనసుకు నచ్చిన పని చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మా ఆయన అమెరికాలో.. నేను ఇక్కడ ఉంటున్నాం. భవిష్యత్తులో అమెరికాలో సెటిల్‌ అవ్వాలని అనిపిస్తే.. అక్కడికే వెళ్తాను’’అని చెప్పుకొచ్చారు.

Show comments