Police Raids Navdeep House: డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. హీరో నవదీప్‌ ఇంట్లో నార్కొటిక్‌ సోదాలు

డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. హీరో నవదీప్‌ ఇంట్లో నార్కొటిక్‌ సోదాలు

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ పార్టీ జరిగినట్లు సమాచారం వెలుగు చూసింది. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలసులు.. ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు.. టాలీవుడ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలా పట్టుబడిన వారిలో రామ్‌చంద్‌ అనే వ్యక్తిని విచారించగా.. హీరో నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చింది. నవదీప్‌కు స్నేహితుడు, సన్నిహితుడు అయిన రామ్‌చంద్‌.. తన వాంగ్మూలంలో.. నవదీప్‌ కూడా డ్రగ్స్‌ సేవిస్తాడని తెలిపాడు. చివరిసారిగా గత శనివారం వీరిద్దరూ డ్రగ్స్‌ తీసుకున్నట్లు వెల్లడించాడు. దాంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు.. ఈ కేసులో నవదీప్‌ పేరు చేర్చారు.

ఈ క్రమంలో విచారణలో భాగంగా.. నవదీప్‌ ఇంట్లో మంగళవారం నార్కోటిక్‌ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే ఆ సమయంలో నవదీప్‌ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో నవదీప్‌ను అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం వరకు నవదీప్‌ను అరెస్ట్‌ చేయవద్దని తెలిపింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. డ్రగ్స్‌ కేసులో పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నవదీప్‌ వినియోగదారుడిగా ఉన్నాడిన.. అతడిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు పోలీసులు.

Show comments