రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే సినిమాల కంటే కూడా ముందు ఆయన శిష్యులు గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఎంత ముక్కుసూటి మనిషో.. వీళ్లంతా ఆయన్ను మించి ఉంటారు. ఏ విషయం ఉన్నా టపీమని కొట్టినట్లే చెబుతారు. వాళ్లందరిలో నటుడిగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి జేడీ చక్రవర్తి. 1989లో శివ సినిమాతో తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. తాజాగా దయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఐడ్రీమ్ మీడియాకి జేడీ చక్రవర్తి ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వూ ఇచ్చాడు.
సాధారణంగానే ఆర్జీవీ శిష్యులు ఇటు టాలెంట్ తోనే కాకుండా.. అటు మాటలతోనూ ఇరగదీస్తుంటారు. ముఖ్యంగా జేడీ చక్రవర్తి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అటు సపోర్టింగ్ రోల్స్.. ఇటు హీరో పాత్రల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అతని కెరీర్లో గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, ప్రేమకు వేళాయరా ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. తాజాగా దయ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పైగా ఈ సినిమా తన కెరీర్ లో గులాబి, సత్య తర్వాత తర్వాత ఈ దయ సినిమా నిలుస్తుందని చెబుతున్నాడు.
అంతేకాకుండా ఐడ్రీమ్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో అసలు నటన ఎలా మొదలు పెట్టాడు? యాక్టర్ ఎలా అయ్యాడు? ఆర్జీవీని ఎలా కలిశాడు? ఇలా చాలానే ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక విషయాన్ని జేడీ చక్రవర్తి ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా అంటే తనలో ఎలాంటి హుషారు ఉంటుందో చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. “గులాబి కంటే కూడా ముందే ఇది జరిగింది. ఓరోజు ఇద్దరం కారులో వెళ్తూ ఉన్నాం. ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా బస్ స్టాప్ వద్ద చాలా మంది ఉన్నారు.
అప్పుడు కృష్ణ వంశీ నాతే.. ‘అరే ఎలా ఉండాలి అంటే.. ఇప్పుడు చెప్పగానే టప్ మని ప్యాంట్ తీసి అండర్ గార్మెంట్ మీద పరిగెత్తాలి అన్నాడు’.. చెబుతూనే అరే ఎవరో అండర్ గార్మెంట్ మీద వెళ్తున్నాడురా అని అంటూ నావైపు తిరిగాడు. అలా పరిగెత్తింది నేనే. ఒక పాయింట్ వంశీకి ప్రూవ్ చేయడానికి నేను ప్యాంట్ లేకుండా ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా రోడ్డుపై పరిగెత్తాను. అలా చేశాను అంటే నాకు సిగ్గు లేదని కాదు. ఆ ఎనర్జీని నేను ట్రాన్స్ ఫామ్ చేయాలి అనుకున్నాను. కృష్ణ వంశీ నాలో అది చూశాడు” అంటూ జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి ఇంటర్య్వూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జేడీ చక్రవర్తి చెప్పిన మరిన్ని విశేషాలను ఈ వీడియోలో చూడండి.