పద్మవిభూషణ్‌ని వరించిన మెగాస్టార్‌

Padma Vibhushan For Chiranjeevi: కొన్ని బిరుదులు కొందరికి విలువను తెస్తాయి. కానీ, కొందరు బిరుదులకే అమూల్యత కట్టబెడతారు. అటువంటివారి జీవితం, అందులోని సార్ధకత, చిరస్మరణీయమైన వెలకట్టలేని విలువలు.. ఇవన్నీ కూడా బిరుదులను చరితార్ధం చేస్తాయి. ప్రస్తుతం చేశాయి. అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు.

Padma Vibhushan For Chiranjeevi: కొన్ని బిరుదులు కొందరికి విలువను తెస్తాయి. కానీ, కొందరు బిరుదులకే అమూల్యత కట్టబెడతారు. అటువంటివారి జీవితం, అందులోని సార్ధకత, చిరస్మరణీయమైన వెలకట్టలేని విలువలు.. ఇవన్నీ కూడా బిరుదులను చరితార్ధం చేస్తాయి. ప్రస్తుతం చేశాయి. అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు.

మెగాస్టార్‌ చిరంజీవిని పద్మవిభూషణ్‌ వరించింది. తప్పేమో.. పద్మవిభూషణ్‌ని చిరంజీవే వరించారేమోనన్నంత సమున్నత స్థానాన్ని ప్రజాహృదయాలలోగానీ, అఖిల తెలుగు ప్రేక్షకులలోగానీ చిరంజీవి సంపాదించుకున్నారంటే అది పెద్ద అతిశయోక్తిగా అనిపించే క్షణాలివి కావు. ఎందుకంటే చిరంజీవి నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతీ పుల్లనీ ఏరుకుంటూ తనదైన గూడు కట్టుకోవడంలో అయన చూపించిన అంకిత భావం, దీక్ష, పట్టుదల ఒకెత్తైతే, అందుకు అవసరమైన ప్రతీ అవకాశాన్ని ఆయన ఒక ఆయుధంగా వాడుకుని శిఖరాగ్ర స్థాయిని చేరుకోవడం ఎందరికి ఆదర్శప్రాయంమైందో పరిశ్రమలో ఎవరినీ అడిగినా అలవోకగా చెబుతారు.

చిరంజీవి.. ఒక చిన్ననటుడిగా జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ తాను స్వప్నించిన ఈనాటి దశకు చేరుకోవడానికి ఆయన చేసిన సాహసాలు, చూపించిన ధైర్యం సినీ హీరోయిజానికే ఒక నూతన దిశానిర్దేశం చేశాయి. వేలాదిమంది అనుకరించి, అనుసరించే మార్గదర్శకాలయ్యాయి. చిత్రనిర్మాణంలో ఇమిడిఉన్న 24క్రాఫ్టులలోనూ ఆయన అభిమానులు, ఆయన ఆరాధకులు నిండిపోయి ఉన్నారు. పద్మభూషణ్‌ అందుకున్న కొన్ని సంవత్సరాల అనంతరమే పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్న నటులు గానీ వ్యక్తులు గానీ చాలా అరుదు లేదా పూర్తిగా మృగ్యమని చెప్పాలి. అటువంటి అరుదైన, అసాధారణమైన గౌరవాన్ని అందుకున్న భారతీయులలో మెగాస్టార్‌ అక్షరాల అగ్రగణ్యుడని చెప్పడం కేవలం వాస్తవాన్ని ప్రతిబింబించడమే అవుతుంది.

మెగాస్టార్ కేవలం కథానాయకుడా.. మరి కేవలం తెలుగు సినిమా బాక్సాఫీసు స్టామినాని వెలికితీసిన ఛాంపియన్నా.. లేదా నిర్మాత మాత్రమేనా.. ఇవన్నీ ప్రశ్నలు మాత్రమే. కానీ సమాధానాలు మాత్రం వేనవేలు. తెలుగు సినిమా వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేసి, మారుమ్రోగించిన ఒక శక్తి స్వరూపం ఆయనైతే, మరోవైపు ఆయన నివసిస్తున్న సమాజంలోని ప్రతీ ఒక్కరికీ తనదైన ప్రాతినిథ్యం మేలు చేకూర్చాలని, తన అస్థిత్వం అందరికీ ప్రయోజనకారిగా మారాలని అనుకున్న లేదా సంకల్పించిన వ్యక్తిత్వానికి చిరంజీవి ఒక నిజరూప ఉదాహరణ. ఇది మరే ఇతర భాషాపరిశ్రమలోనూ ఎవ్వరూ భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించని ఒక మానవీయ సందర్శనం. ఇది ఎవ్వరూ కాదనలేరు.

ఇక తన అంతస్తు, తన ఇమేజ్‌, తన రేంజ్‌ అనుకోకుండా సామాన్యుడిని కూడా తన ప్రాభవం తాకాలని, ఆ తాకిడి సగటు జీవి జీవితానికి నీడ కల్సించాలని అనుకున్న సినీ కథానాయకులు అరుదుగా మనకి గోచరమవుతారు. అటువంటి అరుదైన, పదునైన వ్యక్తిత్వమే చిరంజీవిది. ఈ రోజున దేశం మొత్తం మీద ప్రభుత్వాలు, లేదా కేంద్ర ప్రభుత్వం ఔదార్యంగా ఒక అత్యుత్తమ గౌరవాన్ని కట్టబెట్టాలంటే.. అటువంటి అరుదైన వ్యక్తి ఎవరూ అంటే ఒక్క చిరంజీవి పేరు మాత్రమే కనిపిస్తుంది. వినిపిస్తుంది. అదీ చిరంజీవి సాధించిన ఘనత.

బిరుదులు, అదీ ముఖ్యంగా దేశ ప్రభుత్వం ప్రకటించాలంటే ఎన్నో కొలమానాలుంటాయి. అవి కేవలం సినీ జీవితంలో సాధించిన రికార్డులకో,అవార్డులకో మాత్రమే పరిమితం కాలేవు. పరిపూర్ణమైన జీవితానంద సంపూర్ణతను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కొన్ని అత్యుత్తమ పురస్కారాలకి అటువంటి వ్యక్తుల జీవనపరిధిని పరిశీలిస్తారు. అక్కడే ఎవ్వరైనా నిలబడగలగాలి. అలా నిలవగలిగే వ్యక్తిత్వసాథనను జీవితకాలంలో సాధించగలగాలి. అప్పుడే ఆ వక్తుల జీవనసాఫల్యత సదరు బిరుదులకు గౌరవాన్ని అందిస్తాయి. అందుకే ఈరోజున మెగాస్టార్‌కి పద్మవిభూషణ్‌ అందిందంటే ప్రపంచం నలుమూలల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సూక్ష్మంగా బిరుదుకు అందిన గౌరవం కూడా.

మెగాస్టార్ స్థాపించిన బ్లడ్‌బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ లక్షలాదిమందిని ఆదుకుంది. ఎందరికో పునర్జన్మను ప్రసాదించింది. మరెందరికో ప్రపంచాన్ని, ప్రకృతిని మళ్ళీ తిరిగి చూసే మహదవకాశాన్ని కానుకగా సమర్ఫించింది. ఎందరో విమర్శించారు. లేనిపోని అపవాదులు కుమ్మరించారు. కానీ కాలం పెట్టిన ప్రతీ పరీక్షను చిరంజీవి తట్టుకున్నారు. నిజాయితీగల తన ప్రయత్నాన్ని ఆపదలో ఉన్నవారికి అదనుగా, అవకాశంగా నిలబెట్టారు. అదీ వ్యక్తిత్వమంటే. అదీ వ్యక్తిత్వసౌథమంటే. ఎవరో ఏదో అన్నారు అని కించపడి, కృంగిపోయేవారు కాలానికి ఎదురీదలేరు. కాలం పెట్టే పరీక్షలో నెగ్గలేరు. అలా నెగ్గిన విజయుడు చిరంజీవి. అలా నిలిచిన ధీశాలి చిరంజివి.

అక్కడితో అయిపోలేదు.. కరోనా ముంచుకొస్తే తనకు దశాబ్దాలుగా సహకరించిన వేలాది సినీకార్మికులకు బాసటగా నిలిచి, వారందరికీ గడ్డుకాలంలో జీవితావసరాలను తీర్చే కామధేనువులా సాక్షాత్కరించారు. అందరి ఆశీస్సులు పోగు చేసుకున్నారు. ఆక్సిజన్‌ కరువై అసువులు బాసే వ్యాధిగ్రస్తులను గుర్తించి, ఆక్సిజన్ యూనిట్లను తెలుగు రాష్ట్రాలలో అనువుగా తిప్పి, వీలైనంత పరిధిలో అందరికీ సాయమందించి, సార్ధకనామధేయుడిగా నిరూపించుకున్నారు. ఇది కదా మానవజీవితమం. అందులోని పరిమళం. నలుగురి కోసం నిలిచేవాడే నిజమైన నాయకుడు. అటువంటి నాయకుడికి స్థానమంటూ ఏదీ అక్కర్లేదు. పదవి అన్నదే లేదు. ఏ స్థానం, ఏ పదవి సరిపోతాయి అటువంటి జీవితావసరాలను వెలుగులోకి తీసుకురావడానికి. ప్రాణోపయోగ పరిచర్యలు అందించడానికి. అందుకే మెగాస్టార్‌ చిరంజీవిది సినిమాహీరో స్థానం కన్నా అతి ఎత్తైనది. సినిమా జీవితం కన్నా నిడివైనది.

ఇవి చెప్పగలిగేవి. చెప్పడానకి అనువైనవి. వెలుగు చూసినవి. వెలుగులోకి వచ్చినవి. ఇతరులకి తెలియనివి, చిరంజీవి వ్యక్తిగతంగా కోరుకోనివి.. జీవితానందాన్ని అందించినవి.. గుప్తదానాలు, గురితప్పని వాగ్దానాలు కోకొల్లలు ఆయన జీవనప్రయాణంలో. సుదీర్ఘ జీవన పరిభ్రమణంలో. అందుకే ఈరోజున మెగాస్టార్‌ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అనే బిరుదు ఎంత గొప్పదైనా, మరెంత ఎత్తైనదైనా సరే అది చిరంజీవి సాధించిన సినీ ఘనవిజయాల ముందుగానీ, లేదా ఆయన సాధించుకున్న జీవనసాఫల్యతాసోపానాల ముందుగానీ చాలా కురచనైనది.

కానీ, ఒక ప్రపంచంలో చిరంజీవి అనే స్థానానికి పద్మవిభూషణ్ అనే బిరుదు అదీ ప్రభుత్వం అందించే కోణంలో చూస్తే చాలా గొప్పది. ఒక తెలుగువాడు జాతీయపుపురస్కారం అందుకునే స్థితికి, స్థాయికి చేరుకోగలిగారంటే అది ఒక్క ఆ వ్యక్తికే కాదు, ఆయనని అభిమానించి, ఆరాధించే కోటానుకోట్ల మందికి వర్తిస్తుంది. ఇందులో రాజీయే లేదు. అవును. మెగాస్టార్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌.. బిరుదే ఆయన్ని వరించిందా లేదా ఆయనే బిరుదు ను వరించారా.. అన్నది ఒక చర్చకు దారితీసే ఆసక్తికర అంశం. ఏది ఏమైనా సరే మన చిరంజీవి.. దేశవ్యాప్తంగా అలుముకున్న తెలుగువాడికి వ్యతిరేక ఉద్యమాలను ఢీకొట్టి మరీ ముందువరసలో తళతళా మెరిశారంటే ఎవరికీ గౌరవం.. ఎవరిదీ పురస్కారం? అందరిదీ.. ఇది తెలుగువారందరిదీ.

Show comments