ఇప్పుడంటే ఆర్ఆర్ఆర్ చూసి టాలీవుడ్ లో ఎన్నేళ్లకు మల్టీస్టారర్ వచ్చిందని ఆనందపడుతున్నాం కానీ ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణగారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారంటే ఇప్పటి జెనరేషన్ కు ఆశ్చర్యం కలగొచ్చు. అవేంటో చూద్దాం. కృష్ణకు తన ఏడో సినిమాతోనే స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం దక్కింది. అది కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో వచ్చిన స్త్రీజన్మ(1967). మరుసటి ఏడాది ఇద్దరూ సిఎస్ రావు డైరెక్షన్ లో నిలువుదోపిడీ చేశారు. తెల్లవారుఝాము బెనిఫిట్ షోల సంప్రదాయం మొదలయ్యింది దీంతోనే. మంచి కుటుంబం(1969)లోనూ ఎన్టీఆర్ కృష్ణ సందడి చేశారు. దేవుడు చేసిన మనుషులు(1973)మరో గొప్ప మైలురాయి. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చివరిసారి తెరను పంచుకున్న వయ్యారి భామలు వగలమారి భర్తలు(1982)ఆశించిన విజయం సాధించలేకపోయింది.
శోభన్ బాబుతో మంచి మిత్రులు(1969)ఈ కలయికకు మొదటి పునాది. డాక్టర్ రామానాయుడు గారు నిర్మించిన మండే గుండెలు(1979) భారీ విజయం అందుకుంది. దాసరి దర్శకత్వంలో వచ్చిన కృష్ణార్జునులు(1982)మరో సక్సెస్ ఫుల్ మూవీ. ముందడుగు(1983) సైతం సూపర్ హిట్టు కొట్టింది. ఇద్దరు దొంగలు(1984)ఓ మోస్తరుగా అడగా మహా సంగ్రామం(1985)లో కృష్ణ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఫ్యాన్స్ ఫీలవ్వడంతో శోభన్ బాబు మళ్ళీ జట్టు కట్టలేదు. జానపద స్టార్ కాంతారావుతో ప్రేమజీవులు(1971)లో కలిసి నటించారు కృష్ణ. తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో షేర్ చేసుకున్న అన్నదమ్ముల సవాల్(1978), ఇద్దరూ అసాధ్యులే(1979) రెండూ కమర్షియల్ హిట్లే.
అక్కినేని నాగేశ్వరరావుగారితో కృష్ణ నటించి సతీమణి విజయనిర్మల దర్శకత్వంలో వచ్సిన హేమాహేమీలు(1979)అప్పట్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ ఈ కాంబోతో 1982లో గురు శిష్యులు తీశారు. దాసరిగారు చేసిన ఊరంతా సంక్రాంతి(1983)లేట్ రిలీజ్ వల్ల ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. రాజకీయ చదరంగం(1989)ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. చిరంజీవితో తొలిసారి జట్టు కట్టింది తోడు దొంగలు(1981)తో. అప్పటికాయనకు మెగాస్టర్ ఇమేజ్ లేదు. చిరు ప్రత్యేక పాత్ర చేసిన కొత్త అల్లుడు ఈ లిస్టులోనే ఉంది. డాక్టర్ రాజశేఖర్ తో రవన్న(2000), రవితేజతో బలాదూర్(2008) కృష్ణ గారు లేట్ కెరీర్ లో చేసినవి
బాలకృష్ణతో పాటు కృష్ణంరాజుతో కలిసి సుల్తాన్(2000)లో సిబిఐ ఆఫీసర్ గా మెప్పించారు. నాగార్జునతో వారసుడు(1993), రాముడొచ్చాడు (1996) ఉన్నాయి. సుమన్ తో సంభవం(1998), దాదాగిరి(2008)లాంటి కమర్షియల్ చిత్రాలున్నాయి. కొడుకు మహేష్ బాబుతో రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ తదితర సినిమాల్లో ప్రత్యేక, క్యామియో రెండు తరహా రోల్స్ చేశారు. నడిగర్ తిలగం శివాజీగణేషన్ తో నివురుగప్పిన నిప్పు(1982), బెజవాడ బెబ్బులి(1983)వరుసగా చేశారు. కృష్ణంరాజుతో యుద్ధం(1984), అడవి సింహాలు(1983) లాంటి బంపర్ హిట్లు ఉన్నాయి. ఇలా అన్ని తరాలతోనూ నటశేఖర్ కృష్ణ గారికి ఎప్పటికీ మర్చిపోలేని మల్టీ స్టారర్స్ ఉన్నాయి.