ఇటీవలే ఓరి దేవుడాలో వెంకటేష్ తో పలకరించిన విశ్వక్ సేన్ కు మరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కలేదు కానీ ఓ మోస్తరుగా బ్రేక్ ఈవెన్ దగ్గరకు వెళ్లేలా కనిపిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద కాంతార మినహాయించి చెప్పుకోదగ్గ పోటీ ఏదీ లేకపోవడం కలిసొస్తున్నా విశ్వక్ తీసిన రీమేక్ ని చూసేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించడం లేదన్నది వాస్తవం. వెంకీ పాత్ర చాలా పరిమితమనే టాక్ బయటికి రావడంతో ఫ్యామిలి ఆడియన్స్ కి ఎగ్జైట్ మెంట్ తగ్గిపోయింది. ఫైనల్ గా కమర్షియల్ స్టేటస్ ఏంటనేది ఇంకో వారంలో తేలిపోనుంది. గత నెల నుంచి చెప్పుకోదగ్గ పెద్ద హిట్లు ఏవీ లేకపోవడం ఓరి దేవుడాకు కొంత మేరకు ప్లస్ అవుతున్నా ఓవరాల్ గా మాత్రం యావరేజనే చెప్పాలి.
క్రమంగా విశ్వక్ తన బడ్జెట్ లు పెంచే ప్లాన్ లో ఉన్నాడట. త్వరలో ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందబోయే సినిమాకు ఏకంగా 25 కోట్లవుతుందని అంత మొత్తానికి సిద్ధపడి దర్శకుడు సాహిత్ మోత్కూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఈ సాహిత్ ఆ మధ్య నందుతో గుర్రం టైటిల్ రోల్ లో సవారి తీశారు. డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు బంధం రేగడ్ అనే షార్ట్ ఫిలిం చాలా పేరు తీసుకొచ్చింది. టెక్నికల్లీ ఇంటెలిజెంట్ అనే పేరున్న సాహిత్ చెప్పిన స్టోరీ విశ్వక్ కి నచ్చడంతో ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే అంటున్నారు. స్టూడెంట్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఇంత స్కేల్ లో ఉండే స్టోరీ ఏమయ్యి ఉంటుందో..
ఈ మధ్య ట్రెండ్ చూస్తుంటే కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఎంత బడ్జెట్ పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకం కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. కాంతార పదహారు కోట్లలో తీస్తే గ్రాస్ ఏకంగా మూడు వందల కోట్లు దాటేసింది. బింబిసారని పన్నెండు కోట్లకు అమ్మితే అంతకు రెట్టింపు షేర్ బయ్యర్లను లాభాల్లో ముంచెత్తింది. ఇక కార్తికేయ 2 గురించి చెప్పేదేముంది. తక్కువ అంచనాలతో ప్యాన్ ఇండియా హిట్టు కొట్టింది. కాబట్టి విశ్వక్ సేన్ లాంటి వాళ్ళు రిస్క్ చేయడంలో లాజిక్ ఉంది. ధమ్కీ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తన స్వీయ దర్శకత్వంలోనే తీస్తున్న విశ్వక్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఒక్క పెద్ద సక్సెస్ కెరీర్ ని సెటిల్ చేస్తుంది.