ఇంట్లో నిత్యం నరకం .. పాపం ఆ పసి పిల్లలు ఏం చేశారు..

మద్యానికి బానిసైన కొందరు మగవాళ్లు మృగాలుగా మారుతున్నారు. భార్యలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. తాగుబోతు భర్తల వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది మహిళలు ప్రాణాలు వదిలేస్తున్న సంఘటనలు సమాజంలో చాలానే జరుగుతున్నాయి.  తాజాగా, ఇలాంటి ఓ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. భర్త రోజూ పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడని ఓ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త వేధింపులు తట్టుకునే శక్తిలేక తన పిల్లలతో పాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

పోలీసుల కథనం ప్రకారం… శీల- షణ్ముఖ్ దంపతులు కర్ణాటక రాష్ట్రం, చామరాజనగర్ జిల్లాలోని మధువనహళ్లి గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు యశ్వంత్ (8) సింధు(9) ఉన్నారు. షణ్ముక్‌ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. నిత్యం ఫుల్లుగా తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. అతడి కారణంగా శీల నిత్యం నరకం అనుభవించేది. భర్తకు ఎంతో సర్థి చెప్పేది. పిల్లల కోసమేనా మారమని అనేది. కానీ, అతడిలో మార్పు రాలేదు. రోజూ తాగి వచ్చి శీలతో గొడవపడేవాడు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం కూడా తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భర్త షణ్ముఖ్ గొడవల కారణంగా విసిగి, వేసారిపోయిన శీల ఓ దారుణ నిర్ణయానికి వచ్చింది. బుధవారం పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, ఆ తరువాత ఆమె కూడా తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. ఇది గమనించిన ఇరుగు పొరుగు వాళ్లు స్పృహ తప్పి పడి ఉన్న ముగ్గుర్నీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సింధు (9) మరణించింది. తల్లి శీల, కొడుకు యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఘటనపై కొళ్లేగాల గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments