Dharani
Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. తాజాగా ఓ చోట వ్యక్తిపై రాళ్ల దాడి చేసి మరీ ప్రాణాలు తీశారు. ఆ వివరాలు..
Loan Recovery Agents: లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. తాజాగా ఓ చోట వ్యక్తిపై రాళ్ల దాడి చేసి మరీ ప్రాణాలు తీశారు. ఆ వివరాలు..
Dharani
మనిషి ప్రాణాలు తీయాలంటే యమభటులే రానవసరం లేదు.. రికవరీ ఏజెంట్లు చాలు. ఖర్మ కాలో.. అసరం నిమిత్తమో ప్రైవేట్ సంస్థలు, బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని సకాలంలో చెల్లించకపోతే.. ఇక అంతే సంగతులు. రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగి బతికుండగానే నరకం చూపుతారు. వారి వేధింపులు తాళలేక ఎందరో అమాయకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై అటు ఆర్భీఐ.. ఇటు పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా రికవరీ ఏజెంట్లు చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. కస్టమర్ మీద రాళ్ల దాడి చేస్తూ.. చనిపోయినా కనికరించలేదు. ఆ వివరాలు..
ఈ దారుణం ఖమ్మంలో చోటుచేసుకుంది. బైక్ ఈఎంఐ చెల్లించనందుకు గాను రికవరీ ఏజెంట్లు ఓ కస్టమర్ ను పరిగెత్తిస్తూ.. రాళ్ల దాడి చేస్తూ.. వెంటపడుతుండటంతో.. పాపం ఆ వ్యక్తి భయంతో చెరువులో దూకాడు. అయినా సరే ఏమాత్రం జాలి, దయ లేకుండా అతడిపై రాళ్లు వేయడంతో పాపం బయటకు రాలేక ..ఊపిరాడక చెరువులోనే ప్రాణాలు కోల్పోయాడు ఆ వ్యక్తి. బాధితుడు యూపీ వాసిగా తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఆగ్రా సమీపంలో ఉన్న అయ్యేలా గ్రామానికి చెందిన వినీత్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం.. ఖమ్మం వచ్చి మార్బుల్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని నెలల కిందట వినయ్, ఇతడి మేస్త్రీ అజయ్ ఠాగూర్ కలిసి వైరా రోడ్డులోని టూ వీలర్ షోరూంలో కొంత డౌన్ పేమెంట్ కట్టి రెండు బైక్ లు తీసుకున్నారు.
ప్రారంభంలో ఈఎంఐలు బాగానే కట్టారు. అయితే ఈ మధ్య కాలంలో చేతి నిండా పని లేకపోవడంతో.. ఆర్థికంగా కాస్త ఇబ్బంది తలెత్తింది. దాంతో ఈఎంఐ కట్టలేదు. వినీత్ వాహనంపై రూ.4 వేలు, ఠాగూర్ బండిపై రూ.14 వేలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో రికవరీ ఏజెంట్లు నాలుగు రోజుల క్రితంవినీత్ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. ఠాగూర్ కనిపించకపోవడంతో అతడి బండికి వినీత్ పూచీకత్తుగా ఉన్నాడని, అతడి డబ్బులు కూడా వినీతే కట్టాలని రికవరీ ఏజెంట్లు ఒత్తిడి చేస్తున్నారు. నాలుగు రోజులుగా అతడి వెంటపడుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా వదలడం లేదు.
ఈ క్రమంలో శుక్రవారం బల్లేపల్లి వద్ద వినీత్ ఓ బండిపై వస్తూ రికవరీ ఏజెంట్ల కంట పడ్డాడు. దాంతో వారు వినీత్ను పట్టుకోబోగా అతడు తప్పించుకుని టూ వీలర్ పై కొంత దూరం పారిపోయాడు. అయినా వదలకుండా వెంటాడడంతో బండి వదిలేసి పరిగెత్తాడు వినీత్. దాంతో రికవరీ ఏజెంట్లు రాళ్లు విసురుతూ వినీత్ ను వెంబడించారు. రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకోవడం కోసం వినీత్ మధ్యలో ఓ చెరువు అడ్డం వస్తే దానిలో దూకాడు.
అయినా సరే రికవరీ ఏజెంట్లు ఏమాత్రం జాలి చూపకుండా చెరువులో దూకిన వినీత్ పై రాళ్లు వేడయంతో.. వారికి భయపడి దానిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఊపిరాడక.. వినీత్ చనిపోయాడు. వినీత్ పరిగెత్తుతున్న దృశ్యాలతో పాటు ఏజెంట్లు వెంటపడి రాళ్లేసే విజువల్స్ స్థానికుల ఇండ్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై ఖానాపురం సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.