Venkateswarlu
Venkateswarlu
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు.. తరతరాలకి తరగని వెలుగౌతారు.. ఇలవేలుపులౌతారు.. అని ఓ పాట ఉంది. కృషితో దేన్నైనా సాధించగలం అన్నది ఆ పాట అర్థం. అవును! మనిషి గట్టిగా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికంలో పుట్టి దేశానికి ప్రధానులుగా.. రాష్ట్ర పతులుగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. పేదరికంలో పుట్టి గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్న వారు ఇప్పటికీ.. ఎప్పటికీ దర్శన మిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మహిళ కూడా ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ఎంతో కష్టపడింది. కూలీ పనులు చేస్తూ పీహెచ్‌డీ సాధించింది.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామానికి చెందిన శివప్రసాద్, భారతీ భార్యా భర్తలు. భారతికి చదువంటే ప్రాణం. పెద్ద పెద్ద చదువులు చదవాలని చిన్నప్పటినుంచి కలలు కనేది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్ వరకు మాత్రమే చదవగలిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెకు మేనమామ అయిన శివ ప్రసాద్‌తో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత కూడా ఆమె చదువు మీద ఆసక్తిని చంపుకోలేదు. చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నా.. ఆ విషయాన్ని భర్తకు చెప్పలేకపోయింది. భారతి చెప్పకపోయినా.. శివ ప్రసాద్ ఆమె ఇష్టాన్ని అర్థం చేసుకున్నాడు.
పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో కూలీ పనులకు వెళుతూ ఉండేది. పనులు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు ముందు వేసుకుని కుస్తీ పట్టేది. కొన్ని రోజులు కాలేజీకి వెళుతూ.. మరికొన్ని రోజులు కూలీ పనులకు వెళుతూ చదువును కొనసాగించింది. బిడ్డ పుట్టిన తర్వాత పాప ఆలనా పాలనా చూసుకుంటూనే చదువును కొనసాగించింది. రాత్రి,పగలు అన్న తేడా లేకుండా చదివింది. డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీహెచ్‌డీ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది.
డా.ఎంసీఎస్ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్’ అంశంపై పరిశోధన మొదలుపెట్టింది. కూలీ పనులు చేస్తూనే పీహెచ్‌డీ పూర్తి చేసింది. తాజాగా, పీహెచ్‌డీ పట్టాను అందుకుంది. తాను సాధించిన విజయంపై భారతి మాట్లాడుతూ.. ‘‘ పీహెచ్‌డీ చేస్తే నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో మా జీవితాలు మారిపోతాయి. నా జ్ఞానం నలుగురికి ఉపయోగపడుతుంది. ఎంతో మందికి స్పూర్తిగా నిలవొచ్చనే ఉద్దేశ్యంతోనే నేను ఇదంతా చేశాను’’ అని అన్నారు. మరి, భారతి సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.