ఏపీకి వానగండం.. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు

AP Rains: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. ఆ జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.

AP Rains: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. ఆ జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. గత నెలలో కురిసిన అత్యంత భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో వరదలు సంభవించి కృష్ణా నది, బుడమేరు కాలువలు ఉగ్ర రూపం దాల్చాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. నిలువ నీడ లేక ప్రజలు అల్లాడిపోయారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో వందలకొద్ది బస్సులు, ట్రైన్లు రద్దయ్యాయి. ఈ భయానక పరిస్థితులను మరువక ముందే మరోసారి భారీ వర్షాలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

వానగండం పొంచి ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ఉత్తరతమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ.. రేపటికి తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చునని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యార వాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు-ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటికే 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరి, నెల్లూరులో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. వర్షాలు, వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్ల కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేని వర్షం దంచికొడుతోంది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరో మూడ్రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, అధికారులు మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు.

భారీ వర్షాలు కారణంగా తిరుపతి జిల్లా కోస్తా తీరప్రాంతంలో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇచ్చారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విధిగా సెలవు అమలు చేయాలన్న కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 3 రోజల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Show comments