AP అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం.. ఇక సభలో వాటికి అనుమతి లేదు!

AP అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం.. ఇక సభలో వాటికి  అనుమతి లేదు!

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లుల గురించి చర్చించి.. వాటికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అయితే తొలి రోజే ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. స్కిల్ డెవల్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. అలానే కొందరు తమ మొబైల్లతో సభ కార్యక్రామాలను వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. గురువారం అసెంబ్లీలో టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకా ఫోన్ల అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఫోన్లకు ఏపీ అసెంబ్లీలోకి అనుమతించ కూడదనే భావిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

గురువారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మొదలవగానే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ చేపట్టాలని నిరసన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి.. ప్లకార్డులతో నినాదాలు చేశారు.  అంతేకాక టీడీపీ సభ్యులు స్పీకర్‌ టేబుల్‌పై ఉన్న కాగితాలను చించి గాల్లోకి విసిరారు. ఈ క్రమంలో వారి చేయి తగిలి నీళ్లతో ఉన్న గ్లాసు టేబుల్‌పై పడిపోయి, కాగితాలు తడిసిపోయాయి. దీంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాక కొందరు సభ్యులు అసెంబ్లీలోని దృశ్యాలను తమ ఫోన్ల ద్వారా చిత్రికరించే ప్రయత్నం చేశారని సమాచారం. అలానే జీరో అవర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న సమయంలో ఫోన్లతో వీడియో తీసిన అంశాన్ని ప్రస్తావించారు. అసలు సభలోకి మొబైల్స్ తేవచ్చా.. ఒకవేళ తెస్తే వీడియో తీయొచ్చా అని సందేహం వ్యక్తం చేశారు.

వీడియో తీస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో తెలపాలని కోరారు. దీనిపై రూలింగ్‌ ఇవ్వాల్సి ఉందని స్పీకర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలోకి సభ్యులు మొబైల్స్ తీసుకురాకుండా, వాటిని ప్రవేశ ద్వారం దగ్గర డిపాజిట్‌ చేసే విధానం తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మొబైల్స్, టేప్‌రికార్డర్లు సభలోకి, గ్యాలరీల్లోకి తీసుకువస్తే సీజ్‌ చేయాలని ఉందని తెలిపారు. అలాగే సభలో వీడియో తీసిన సభ్యుడిని సస్పెండ్‌ చేశామని.. దీనిపై ఎథిక్స్ కమిటీకి రిఫర్‌ చేస్తామని పేర్కొన్నారు. మరి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తీసుకోవాలని భావిస్తున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments