iDreamPost

16 ప్రజా సంఘాలపై నిషేధం… ఇప్పుడే ఎందుకు?

16 ప్రజా సంఘాలపై నిషేధం… ఇప్పుడే ఎందుకు?

కరోనా కల్లోల సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 16 ప్రజాసంఘాలను నిషేధించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు బ్యాన్ కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నాయంటూ 16 సంఘాలపైనా వేటు వేసింది. ఇందులో ‘విరసం(విప్లవ రచయితల సంఘం)’ కూడా ఉండటం గమనార్హం. పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ప్రకారం వీటిపై ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు. మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆలస్యంగా వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు నిషేధం విధించడం వెనుక మతలబు ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

నిషేధం వీటిపైనే..

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టీపీఎఫ్‌), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్‌), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్‌), ఆదివాసీ స్టూడెంట్‌ యూనియన్‌ (ఏఎస్‌యూ), కమిటీ ఫర్‌ రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (సీఆర్‌పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్‌ఎస్‌), తుడుందెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (టీడీఎఫ్‌), ఫోరం అగైనెస్ట్‌ హిందూ ఫాసిజం అఫెన్సివ్‌ (ఎఫ్‌ఏహెచ్‌ఎఫ్‌వో), సివిల్‌ లిబర్టీస్‌ కమిటీ (సీఎల్‌సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్‌), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌), విప్లవ రచయితల సంఘం (విరసం)పై తెలంగాణ సర్కారు ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే బ్యాన్ విధించినట్లు చెబుతోంది.

Also Read : మీకు18 ఏళ్ళు దాటిందా.. టీకా రిజిస్ట్రేషన్ ఇలా!

చట్టవిరుద్ధం ఎలా అవుతుంది

ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న 16 ప్రజాసంఘాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధం తనను నిర్ఘాంతపరిచిందని ప్రొఫెసర్ హరగోపాల్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పౌరహక్కుల సంఘంలో భాగం అవుతానని కేసీఆర్‌ ప్రకటించారని, మరి అలాంటి సంఘం ఇప్పుడు చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన ఓ లేఖ రాశారు. ప్రజాస్వామ్య విలువల్ని తిరస్కరించేలా ఉన్న నిషేధం జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా ఏడాది కాలంగా ఈ సంఘాలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆరేడు నెలలుగా తెలంగాణలో మావోయిస్టుల చర్యలు కూడా లేవు. అలాంటప్పుడు నిషేధం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రేరేపించిన అంశం ఏమిటని హరగోపాల్‌ ప్రశ్నించారు.

దృష్టి మళ్లించేందుకేనా..

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. టెస్టులు, ట్రీట్ మెంట్ విషయంలో ప్రతి రోజూ హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది. సర్కారు తీరుపై ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నాలుగు రోజుల్లో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువే. దీంతో ప్రజా సంఘాల నాయకులు తమకు వ్యతిరేకంగా పని చేయకుండా అడ్డుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

నిషేధం ఎత్తేయాలంటూ డిమాండ్లు

ప్రభుత్వం నిషేధం విధించడాన్ని పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సర్కారు తన నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతవాసుల హక్కులను కాలరాస్తే తానే పౌరహక్కుల సంఘం అధ్య క్షుడిగా బాధ్యతలు తీసుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర సాధన పోరాటం కోసం పనికి వచ్చిన పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు ఇప్పుడెందుకు కేసీఆర్‌కు అక్కరకు రాకుండా పోయాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రజాసంఘాలను నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.

Also Read : నష్టం జరిగాక చర్యలు.. ఆలస్యమైంది ప్రధాని గారు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి