iDreamPost
android-app
ios-app

దిగ్గజ జట్టును మట్టికరిపించిన బెజవాడ కుర్రాడు! ఎవరీ తేజ నిడమనూరు?

  • Author Soma Sekhar Published - 11:42 AM, Tue - 27 June 23
  • Author Soma Sekhar Published - 11:42 AM, Tue - 27 June 23
దిగ్గజ జట్టును మట్టికరిపించిన బెజవాడ కుర్రాడు! ఎవరీ తేజ నిడమనూరు?

ప్రస్తుతం వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. పసికూనలుగా భావించిన జట్లు పెద్ద జట్లకు షాక్ ఇస్తూ.. వరల్డ్ కప్ రేసులో ముందుకు దూసుకెళ్తున్నాయి. తాజాగా హరారే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు షాక్ ఇచ్చింది నెదర్లాండ్ జట్టు. సూపర్ ఓవర్లో విండీస్ ను చిత్తుగా ఓడించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో.. తెలుగు కుర్రాడి సంచలన ఇన్నింగ్స్ ఉంది. విజయవాడ కుర్రాడు తేజ నిడమనూరు నెదర్లాండ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో సంచలన శతకంతో డచ్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

హరారే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో విజయం సాధించి.. వరల్డ్ కప్ రేసులో ఉంది. కాగా.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో ఓడిన విండీస్ తాజాగ కూడా ఓడిపోవడంతో.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అజేయ శతకంతో చెలరేగాడు. అతడు కేవలం 65 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104* పరుగులతో చెలరేగాడు. మిగతా వారిలో ఓపెనర్ బ్రెండన్ కింగ్ (76), చార్లెస్ (54) పరుగులు చేశారు.

అనంతరం 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ తొలి నుంచే ఎదురుదాడికి దిగింది. కష్టసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని కూడా ఛేదించింది. ఈ క్రమంలోనే విండీస్ బౌలర్లను వణికించాడు తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు. సెంచరీతో చెలరేగిన తేజ 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. తేజ తుపాన్ ఇన్నింగ్స్ కారణంగానే నెదర్లాండ్ జట్టు మ్యాచ్ ను టై చేసుకుంది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీయగా.. సూపర్ ఓవర్లో నెదర్లాండ్ 30 పరుగులు చేసింది. డచ్ బ్యాటర్ వాన్ బీక్ 4, 6,4, 6, 6, 4 లతో బౌండరీల మోత మోగించాడు. అనంతరం విండీస్ 2 వికెట్లు నష్టపోయి కేవలం 8 పరుగులే చేసింది. దాంతో విండీస్ అపజయాన్ని మూటగట్టుకుంది.

ఎవరీ తేజ నిడమనూరు?

అనిల్ తేజ నిడమనూరు.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అతడు జన్మించాడు. అయితే తేజకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే అతడి కుటుంబం న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక చిన్నతనం నుంచే తేజకు ఆటలపై ఆసక్తి ఏర్పడింది. దాంతో న్యూజిలాండ్ తరపున రగ్బీ ఆటలో అతడు పట్టుసాధించాడు. అయితే అనుకోకుండా క్రికెట్ వైపు తన కెరీర్ ను మార్చుకున్నాడు ఈ యువ ఆటగాడు. తన తల్లి పనిచేసే చోటు పక్కనే కార్న్ వాల్ క్రికెట్ క్లబ్ ఉంది. దాంతో రోజూ క్రికెట్ చూస్తూ పెరిగాడు తేజ. కాగా.. అతడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అతడిని అందులో చేర్పించారు. దాంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. స్థానిక లీగుల్లో సత్తాచాటిన తేజ.. ఆక్లాండ్ ‘ఎ’ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ లో ఎదగలేనని తేజ తొందరగానే గ్రహించాడు. దాంతో ఇంగ్లాండ్ కౌంటీ డర్హమ్ మైనర్ లీగ్ లో అడుగుపెట్టాడు. అయితే ఈ లీగ్ లో ఒప్పందం ముగియగానే మళ్లీ కివీస్ కు వచ్చాడు.

ఈ క్రమంలోనే గతంలో నెదర్లాండ్స్ లో క్రికెట్ ఆడిన తేజ.. ఇక్కడే పూర్తి స్థాయిలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడి నిబంధనలు అతడికి అడ్డుగా నిలిచాయి. క్రికెటర్ కావాలి అన్న తన కల ముందు అవన్ని చిన్నగానే కనిపించాయి తేజకు. 2022లో నెదర్లాండ్స్ జాతీయ జట్టుకు ఎంపికైయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే అర్ధ శతకంతో రాణించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా సెంచరీతో చెలరేగి తన టీమ్ కు విజయాన్ని అందించాడు. అతడు మరింతగా ఎదగాలని తెలుగు అభిమానులు కోరుకుంటున్నారు.