iDreamPost

హంతకుడితో చిచ్ఛరపిడుగు ఢీ – Nostalgia

హంతకుడితో చిచ్ఛరపిడుగు ఢీ – Nostalgia

చిన్న పిల్లల్ని టైటిల్ రోల్స్ లో పెట్టి సినిమాలు తీయడం చాలా కష్టం. వాళ్ళతో నటింపజేయడం ఒక ఛాలెంజ్ అయితే డిస్ట్రిబ్యూటర్లకు వీటిని మార్కెట్ చేయడం మరో పెద్ద సవాల్. అవార్డుల సంగతేమో కానీ కమర్షియల్ కోణంలో చూసుకుంటే ఇలాంటి చిత్రాల్లో చాలా రిస్క్ ఉంటుంది. అందుకే సాధారణంగా వీటి జోలికి ఎవరు వెళ్లరు. బాగా వెనక్కు వెళ్తే బాలరాజు కథ, సిసింద్రీ చిట్టిబాబు, లేత మనసులు, పాపం పసివాడు లాంటివి వచ్చాయి. మంచి విజయం సాధించాయి కూడా. కానీ ఎక్కువ శాతం వీటి జోలికి వెళ్లని వాళ్లే. పిల్లలను పెద్దలను మెప్పించేలా యునివర్సల్ అనిపించే సినిమాలు తెలుగులో కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి తేజ.

1992 సంవత్సరం. విలువలతో కూడిన కథలతో సినిమాలు తీసేందుకు నిర్మాణ సంస్థను స్థాపించిన రామోజీరావు ఆ సూత్రానికి అనుగుణంగానే మయూరి, ప్రతిఘటన, అమ్మ, మనసు మమత లాంటి ఆణిముత్యాలు అందించారు. ఆ క్రమంలో 1990లో వచ్చిన ‘హోమ్ అలోన్’ అనే హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఓ లైన్ ని రాసుకున్నారు దర్శకుడు హరిబాబు. అందులో హాస్యాన్ని తగ్గించి ఇక్కడి వెర్షన్ కి క్రైమ్ ఎలిమెంట్ జోడించి రచయిత సత్యానంద్, బొల్లిముంత నాగేశ్వర్ రావులతో కలిసి మంచి సబ్జెక్టు సిద్ధం చేసుకున్నారు. అదే తేజ. సంగీత దర్శకుడిగా అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న ఎంఎం కీరవాణికి మరో అవకాశం దక్కింది.

చదువులో చాలా చలాకిగా ఉంటూ ఎవరూ ఊహించని స్థాయిలో మేధస్సుని కలిగిన చిన్న కుర్రాడు తేజ(మాస్టర్ తరుణ్) ఓసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు వినోద్(ప్రసాద్)హత్య చేయడాన్ని అనుకోకుండా ఫోటోలు తీస్తాడు. మర్డర్ ని కళ్లారా చూసిన టీచర్ శారదకు స్ఫూర్తి నిచ్చి ఆవిడ మాజీ భర్త అయిన వినోద్ అరెస్ట్ కు కారణం అవుతాడు. జైలు నుంచి తప్పించుకున్న వినోద్ తేజలు ఒకే ఇంట్లో బందీలవుతారు. ఆ తర్వాత ఉంటుంది అసలు థ్రిల్. ఉషాకిరణ్ సంస్థ చేసిన చక్కని పబ్లిసిటీ తేజకు ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ ఇచ్చింది. 1992 మే 1న రిలీజైన తేజ సరిగ్గా వారం రోజులకు వచ్చిన ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించింది. ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు, ఉత్తమ విలన్ ఇలా మూడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి