iDreamPost

మాటల మాంత్రికుడికి 20 ఏళ్ళు

మాటల మాంత్రికుడికి 20 ఏళ్ళు

ఏ సినిమా విజయంలో అయినా మాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి వాటిని గుర్తు చేసుకున్నప్పుడే సదరు రచయిత దర్శకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు. రాజమౌళికి టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో డైరెక్టర్ గా ఎంత గొప్ప పేరైనా ఉండొచ్చు కానీ ఆయన ఏనాడూ డైలాగులు రాయలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇందులోనూ తన విశేష ప్రతిభ చాటి రెండు పడవల ప్రయాణంలో తానెంత నిష్ణాతుడో ఇప్పటికీ చాటుతూనే ఉన్నారు. ఈ రోజు మాటల మాంత్రికుడు కెప్టెన్ అఫ్ ది షిప్ గా మెగా ఫోన్ పట్టుకుని డెబ్యూ చేసి సరిగ్గా ఇరవై ఏళ్ళు అయ్యింది. 2002 అక్టోబర్ 10 ‘నువ్వే నువ్వే’ రిలీజ్ డేట్.

అప్పటికే స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ తో రైటర్ తో తన బలమేపాటిదో ఋజువు చేసుకున్న త్రివిక్రమ్ కు దర్శకుడిగా మొదటి అవకాశం అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ తో అందుకున్నారు. తండ్రి కూతుళ్ళ అనుభవాన్ని తెరపై ఆవిష్కరిస్తూనే ఓ కుర్రాడి ప్రేమలోని నిజాయితీని సరికొత్తగా ఆవిష్కరించిన తీరు యూత్ కే కాదు ఫ్యామిలీస్ కి సైతం విపరీతంగా నచ్చేసింది. పైకి జులాయిగా కనిపించే కుర్రాళ్ళను దేనికీ పనికిరారని లెక్కేసే పడికట్టు మనస్తత్వాలను ప్రశ్నించేలా సున్నితమైన భావోద్వేగాలను చూపించిన వైనం నువ్వే నువ్వేని సూపర్ హిట్ చేసింది. కోటి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే

తరుణ్, శ్రేయ జంటకు ధీటుగా తండ్రి క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటాయి. అక్కడితో మొదలు త్రివిక్రమ్ కు వెనుదిగిరి చూడాల్సిన అవసరం రాలేదు. రెండో సినిమానే టాప్ ప్రొడ్యూసర్ మురళీమోహన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోతో అతడు రూపంలో దొరికింది. దాని గురించి ఇక్కడ చిన్న మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో దాకా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబుతో మూడో సారి జట్టుకట్టడం అప్పుడే అంచనాలను ఆకాశం దాటించేసింది. త్రివిక్రమ్ మాయాజాలం బలం అలాంటిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి