iDreamPost

సాంకేతిక ‘మాంద్యం’

సాంకేతిక ‘మాంద్యం’

ఆర్ధిక మాంద్యం ఈ పేరు వింటేనే ఆర్ధికంతో ఎంతు పటుత్వం కలిగిన దేశాలు సైతం హడలెత్తిపోతాయి. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో దేశాలు ఆర్దిక మాంద్యం దెబ్బకు కుదేలైపోయి, అక్కడివారి జీవనం భారంగా మారిన పరిస్థితులు ఇతర ప్రపంచ దేశాలకు సుపరిచితమే. ఈ నేపథ్యంలో తమతమ ఆర్ధిక వ్యవస్థలు మాంధ్యం భారిన పడకుండా వీలైనన్ని ఉద్దీపన చర్యలతో గట్టెక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాయి.

అయితే కోవిడ్‌కారణంగా ప్రపంచ ఆర్ధిక రంగం కుదేలైపోయిందన్నది నిపుణులు తేల్చేసారు. అయితే అది ఎంత వేగంగా రికవరీ అవుతుందన్నదానిపైనే మాంద్యం వైరస్‌ ఈ వ్యవస్థకు వస్తుందా? రాదా? అన్నది తేలుతుంది. ఈ లోపు వరుసగా రెండు త్రైమాసిక ఫలితాల్లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సూచీల స్థాయి తక్కువగా నమోదైదే, సాంకేతికంగా ఆ ఆర్ధిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టుగానే లెక్కగడతారు.

మనదేశానికి సంబంధించి గత రెండు త్రైమాసికాల్లోనూ తక్కువ జీడీపీ నమోదుకావడంతో సాంకేతికంగా మాంద్యంలోకి ప్రవేశించినట్టుగా ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు. ఈ మేరకే ఆర్బీఐ కూడా నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. అయితే వైరస్‌ల నుంచి రికవరీ రేటుకు మాదిరిగానే, ఆర్ధిక వ్యవస్థ రికవరీ కూడా అద్భుతంగానే ఉందని, వేగంగానే కోలుకుని మునుపటి స్థాయికి చేరుతుందన్న అంచనాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆశావహ దృక్ఫథంతో పాటు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు చేపట్టబోయే ఉద్దీపనల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు దేశంలో కోవిడ్‌ కారణంగా ఒడిదుడుకులకు లోనైన 26 రంగాలను గుర్తించారు. వీటిని గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్ధికశాఖామంత్రి నిర్మలాసీతారామన్‌ భారీ ప్యాకేజీలను ప్రకటించారు. పండుగ ముందే ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీ ద్వారా ఎమర్జెన్సీ క్రెడిట్‌ లిక్విడిటీ క్రింద కూడా రెండులక్షల కోట్లకుపైగా మంజూరు చేస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. జీఎస్టీ కలెక్షన్లు, బ్యాంక్‌ క్రెడిట్స్, ఎఫ్‌డీఐ ఫ్లో తదితర అంశాలను పరిశీలిస్తే.. దేశంలో ఆర్ధిక వ్యవస్థ బలమైన రికవరీకి అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రైతులకు ఎమర్జెన్సీ వర్కింగ్‌ క్యాపిటల్‌ క్రింద నాబార్డు ద్వారా రూ. 25వేల కోట్లు కేటాయించనున్నామన్నారు. అలాగే ఆర్ధిక వ్యవస్థకు బూస్ట్‌నిచ్చే అన్ని వ్యవస్థలు సమగ్రంగా కోలుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు చేపడుతున్న చర్యల ద్వారా సాంకేతిక మాద్యం స్ధాయి నుంచి త్వరగానే ఆర్ధిక వ్యవస్థ బైటపడుతుందన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి