iDreamPost

రండి, రోడ్డు మీద టమోటాలు ఫ్రీగా ఏరుకోండి

రండి, రోడ్డు మీద టమోటాలు ఫ్రీగా ఏరుకోండి

ఈ రోజు హోల్ సేల్ మార్కెట్ లో 10 నుండి 12 రూపాయలు , రిటైల్ మార్కెట్ లో 15 నుండి 20 రూపాయలు కేజీకి పలుకుతున్న టొమాటో ధరలో రైతుకు దక్కుతుంది ఎంతో తెలుసా ??? .
3 నుండి 4 రూపాయలు .

నిన్నా మొన్నా అనంతలో టొమాటో రైతులు గిట్టుబాటు లేదని రోడ్డు పక్కన పారబోసిన వార్తలు మీరు చదివే ఉంటారు .దీని వెనక ఉన్న వాస్తవాలు చూద్దాం .

ప్రస్తుత క్రాప్ ఇయర్ లో అనంతలో 16000 హెక్టార్లలో , చిత్తూర్ లో 34000 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో సాగవుతున్న టొమాటో పెట్టుబడి వ్యయం ఎకరాకు 18 నుండి 22 వేలు అవుతుంది (సగటు 21 వేలు) . 90 వ రోజు నుండి ప్రారంభమయ్యే దిగుబడి 160 నుండి 180 రోజుల వరకూ వస్తుంది .
సగటున 160 ట్రేలు అంటే 160 ×20 =3200 kg ఫలసాయం అందుతోంది .
సరాసరిన 20000 వేలు పెట్టుబడి 3200 కేజీల దిగుబడి అంటే కేజీ రూ 6 . 25 పైసలు పడుతుంది .

స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం 6.25 ×50 శాతం = 9.37 పైసలు కనీస గిట్టుబాటు ధర . కానీ రైతుకు ఎంత దక్కుతుంది .

అనంతపురం రైతులు స్థానిక మార్కెట్ అవకాశాలు లేక కర్ణాటకలోని చింతామణి మార్కెట్ వరకూ తీసుకెళ్లి అమ్ముకోబోతే బాక్స్ 70 రూపాయలు మించి ధర పలకట్లేదు . దీంట్లో 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ రైతు నెత్తినే పడుతుంది . ఆ లెక్క ప్రకారం రైతుకి చెందుతుంది బాక్స్ కి 40 రూపాయలు కేజీకి రెండు రూపాయలు . ఈ మాత్రం దానికి అక్కడికి పోవటం కన్నా ఇక్కడ పారబోస్తే పశువులు అన్నా బతుకుతాయి అనే నిర్వేదంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతు తన కష్టాన్ని స్వహస్తాలతో నేలపాలు చేస్తున్నాడు .

రెండు నెలల క్రితం కడపలో ఇలాగే ధర గిట్టుబాటు కాకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకున్న ప్రభుత్వం ఇప్పుడు కూడా రైతుల్ని తక్షణం ఆదుకోవాలి . ఈ దిశగా మార్కెట్ అక్షన్స్ లో పాల్గొని రైతుల్ని ఆదుకొంటాం అన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు గారి ప్రకటన హర్షణీయం . కానీ మిర్చి , పత్తి , ధాన్యం రైతులకుండే కాల వ్యవధి టొమాటో రైతులకు ఉండదు . మూడు నాలుగు రోజుల కన్నా నిల్వ ఉండని పంట కాబట్టి ప్రభుత్వం సత్వరమే స్పందించి దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి గిట్టుబాటు ధర అందించి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి .

అంతే కాదు టొమాటో యధాతద రూపంలో అయ్యే వినియోగం పోను మన దేశంలో టొమాటో ఆధారిత ఉత్పత్తుల మార్కెట్ సాలీనా 2000 కోట్ల పై మాటే .

రాయలసీమ నుండి ప్రస్తుత ఏడాది పంట విలువ గిట్టుబాటు ధర ప్రకారం 420 కోట్లు . ఈ ఉత్పత్తిలో కనీసమ్ 25 శాతం అంటే 100 కోట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టొమాటో ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తే వీటి ద్వారా రైతులకు స్థానికంగానే గిట్టుబాటు ధర కల్పించవచ్చు . దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ లో 20 శాతం చేజిక్కించుకోలేమా?

లక్షన్నర ఎకరాల్లో వేసిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆ రైతులు సంక్షోభంలో ఉంటే అధికార పార్టీ పత్రికలో వార్త వచ్చింది . వ్యవసాయ మంత్రి స్పందించారు. ఇలాంటి రైతు సమస్యల మీద ప్రధాన ప్రత్రికలు మాత్రం స్పందించటం లేదు.ప్రభుత్వం మీద విరుచుకుపడే ఈనాడు లాంటి పత్రిక ఇలాంటి రైతు సమస్యల మీద గట్టిగా రాయాలి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.

ప్రతిపక్ష ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి కాబట్టి వారి నుంచి టమోటా రైతు సమస్యల మీద స్పందన కష్టమే… అన్నింటిని మించి ప్రభుత్వం ఎవరితోనూ అడిగించుకునే పరిస్థితి కలగక ముందే సమస్య పరిష్కారం చెయ్యాలి… అధికార పక్షం,ప్రతి పక్షం మరియు మీడియా ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉండవచ్చు కానీ రైతు సమస్య పరిష్కారం కావాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి