iDreamPost

ఏపీ ప్రతిపక్షం…ప్రజలకు బద్ధ వ్యతిరేకం..!

ఏపీ ప్రతిపక్షం…ప్రజలకు బద్ధ వ్యతిరేకం..!

ప్రతిపక్షం…ప్రజాపక్షం వహిస్తుంది…! ఇదెక్కడైనా కుదురుతుందేమో కానీ, ఏపీలో…అందునా తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నంత కాలం కుదిరేపనిలా లేదు..! ‘ మోదీతో అనేక అంశాల్లో విబేధిస్తా…కానీ, ఈ సమయంలో కాదు’..ఇదీ తాజాగా రాహుల్‌ గాంధీ స్పందన. కానీ, ఏపీలో మాత్రం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు దీనికి పూర్తి విరుద్ధం. మెడికల్‌ ఎమెర్జెన్సీలోనూ ప్రభుత్వంపై కుట్రపూరిత విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.

ఇదీ బాబు రాజకీయం…!

ప్రతిపక్షం ప్రజల కోసం ప్రజాస్వామ్యుతంగా పోరాడాలి. యుద్ధాలు, విపత్తులు సమయాల్లోనైతే రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఆత్మస్థర్యం కల్పించాలి కానీ, చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఉంటూ రోజూ వీడియో కాన్ఫెరెన్స్‌ పెడుతూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. దురదృష్టమేమంటే దానికి కొన్ని మీడియా చానెళ్లు విస్తృత ప్రచారం కల్పిస్తుండటమే…! 

శవరాజకీయం…

ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుండి అధికార యంత్రాంగాన్ని నడిపిస్తుంటే…చంద్రబాబు మాత్రం రాష్ట్రంలోకి అడుగైనా పెట్టకుండా…కరోనా మరణాలపై ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందంటూ దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. జిల్లాల వారీగా డాక్టర్ల సంఖ్యపైనా రాజకీయం చేస్తున్నారు. విశాఖ నగరం ఉత్తరాంధ్రకు విద్యా, ఉద్యోగ, వైద్య కేంద్రంగా ఉంది.  మన్యంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా నుంచీ వైజాగ్‌ కేజీహెచ్‌కు రోగులొస్తుంటారు. తరచూ మన్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తూ ఉంటాయి. ఇత్యాధి కారణాలతో వైజాగ్‌లో ఎక్కువ మంది డాక్టర్లు ఉంటారు. పోనీ, కరోనా వచ్చింది కాదా అని ఇతరత్రా వ్యాధులు ప్రజలకు రాకుండా ఆగాయా అంటే అదీ లేదాయా…! దీంతో ఆయా వ్యాధుల చికిత్సనూ డాక్టర్లు చూసుకోవాలి. కానీ,చంద్రబాబుకి మాత్రం వెంటనే ఆయా జిల్లాల్లో ఉన్న డాక్టర్లందరినీ గుంటూరు, కర్నూలు జిల్లాలకు తరలించేయాలంట.
మరి ఆయా జిల్లాల్లో ఇతర వ్యాధులతో హాస్పిటల్స్‌కు వచ్చే వారిని ఎవరు చూడాలి…? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పరు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేస్తూ డాక్టర్ల సంఖ్యపై నిర్ణయం తీసుకుంటుంది. అయినా ప్రతీ కరోనా పేషెంటుకు ఓ డాక్టర్‌ను కేటాయించటం సాధ్యమా?…ఆరోగ్య రంగంలో ఎంతో ముందున్న అమెరికా, ఇటలీలకు కూడా సాధ్యం కాదు…! కానీ, ఇవేవీ చంద్రబాబుకు, ఆయన భజన మీడియాకు పట్టువు…! ఎందుకంటే వారిది ప్రజాపక్షం కాదు కాబట్టి…!

అసలు మీరేం చేస్తున్నారు…

రాష్ట్రంలో వలస కార్మికులను ఆకలి కష్టాల నుంచి బయటపడేసేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు మూడు వేల క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటిలో ఏపీతోపాటు ఇతర రాష్ట్రలకు చెందిన వారికీ మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. దీనిపై జాతీయ మీడియా సైతం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ఇదే స్ఫూర్తితో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వంటి వారు పేదల ఆకలిని తీర్చేందుకు కృషిచేస్తూ…మరింత మందిని ఆ దిశగా కార్యోన్ముఖులను చేస్తున్నారు. కానీ, దురద్రుష్టవశాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని గోబెల్స్‌ రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. పోనీ ట్విట్టర్‌ రాజకీయాలు చేసే లోకేశ్‌ అయినా పేదలకు అండగా నిలుస్తారనుకుంటే…ఆయన తన కుమారుడు దేవాన్ష్‌తో కలసి హైదరాబాద్‌ రోడ్లపై సైకిల్‌ రైడ్లు చేస్తున్నారు.  దీంతో రాష్ట్రం కరోనాతో యుద్ధం చేస్తున్న తరుణంలో…పక్క రాష్ట్రంలో సేదతీరే వారికి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదంటూ కామెంట్లు పడుతున్నాయి. 

పార్టీ నేతలదీ అదే తీరు…

అధినేత రాజకీయాన్నే టీడీపీలోని ఇతర నేతలూ అనుసరిస్తున్నారు. వంగలపూడి అనిత, కళా వెంకట్రావు, బండారు సత్యనారాయణ వంటి నేతలు..ఇంట్లో నుంచే వీడియో రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్రానికి అనుభవజ్ఞుడి అవసరం ఉందంటూ…చంద్రబాబును లేపే ప్రయత్నం చేస్తున్నారు. దేవినేని ఉమా వంటి నేతలైతే ఫక్తు శవరాజకీయంలో తీరికలేకుండా గడుపుతున్నారు. దీన్నంతా గమనిస్తున్న ప్రజలు అనవసరంగా టీడీపీకి ప్రతిపక్ష హోదా కట్టబెట్టామా అంటూ చింతిస్తున్నారు…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి