iDreamPost

అప్పుడే చుట్టాలైపోయారా ? !.. టిడిపిలో పవనోత్సాహం !

అప్పుడే చుట్టాలైపోయారా ? !.. టిడిపిలో పవనోత్సాహం !

జనసేన ఆవిర్భావ సభపై పసుపు మీడియా కవరేజీ చూస్తే జనసేన , టిడిపి మధ్య అప్పుడే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ఆనందం టిడిపి నేతల్లో కనిపిస్తోంది . ఈసభ జనసేనలో కన్నా తెలుగుదేశంలో పవనోత్సాహం కలగజేసిందని చెప్పవచ్చు . ఈనాడు పత్రిక తెలుగుదేశం మినహా ఇతరపార్టీలు భారీ బహిరంగసభలు పెడితే పెద్దగా కవరేజ్ ఇవ్వదు. అలాంటిది జిల్లా పేజీల్లో ప్రత్యేక కథనాలను ప్రచురించడం చూస్తే అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు టిడిపి , జనసేన అప్పుడే చుట్టాలు అపోయినట్లు తాము అధికారంలోకి వచ్చేసినట్లు కూడా టీడీపీ నేతలు కలల్లో తేలియాడుతున్నారు .

2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలంటే భయపడుతున్న టిడిపికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఊరట కలిగిస్తోంది . ఈసభలో పవన్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడంతో పాటు , వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని , వైసిపి వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలని పిలుపునివ్వడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని పరోక్షంగా స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు . మరోవైపు వారికి ఎంతో ఇష్టమైన రాజధాని అమరావతిపై కూడా ఆయన అభయం ఇవ్వడం విశేషం . పవన్ ప్రకటనపై టిడిపి నేతలు తమ ఆనందాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు .

బిజెపి ఒప్పుకుంటుందా ?

వైసిపి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్న పవన్ కల్యాణ్ పిలుపు వినడానికి బాగానే ఉన్నా … రోడ్డు మ్యాప్ ఇవ్వాల్సిన బిజెపి ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్నదే పెద్ద చర్చనీయాంశం . 2014 ఎన్నికల తరువాత బిజెపి పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు , పొత్తు విచ్చిన్నం తరువాత ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగతంగా దూషించిన విషయాన్ని ఇప్పటికీ నిజమైన బిజెపి కార్యకర్తలెవరూ మర్చిపోలేదు . ప్రధాని మోడీయే చంద్రబాబు నాయుడు అవినీతిని , వ్యవహారశైలిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు . భవిష్యత్లో టిడిపితో పొత్తు ప్రసక్తేలేదని గతంలో హోమ్ హోంమంత్రి అమిత్ షా ,రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ ,రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు . మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపికి బి జట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ , సిపిఐ పార్టీలు సిద్ధాంతపరంగా బిజెపికి బద్ధవైరమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది . ఈ నేపథ్యంలో జనసేన , బిజెపి కూటమిలోకి టిడిపి కూటమి చేరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .

అధికారంలోకి వస్తే పవనే సిఎం అట

వైసిపి వ్యతిరేక శక్తులతో కలిసి అధికారంలోకి వస్తే రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందని జనసేనాని పవన్ స్పష్టం చేశారు . తద్వారా ఒకవేళ వైసిపి వ్యతిరేక కూటమి అధికారంలోకి వస్తే తానే సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు . ఇందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అంగీకరిస్తారా అన్నది చర్చనీయాంశం . అయితే ఈ కూటమి కనీసం సీట్ల పంపకం వరకైనా వస్తుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు . గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ప్రామాణికంగా తీసుకుని బిజెపి , టిడిపి పార్టీలు సీట్లను కేటాయిస్తే 10 శాతం సీట్లు కూడా జనసేనకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు . మరోవైపు ఇప్పటికీ పార్టీ జెండాను పట్టుకుని మోస్తున్న టిడిపి కార్యకర్తలు సీట్ల కోసం పట్టుబట్టి , అసమ్మతి రాగాన్ని వినిపించే అవకాశాలు లేకపోలేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి