iDreamPost

ఇవేం మాటలు అచ్చెన్నా..?

ఇవేం మాటలు అచ్చెన్నా..?

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చే నినాదం. కానీ, కలలు మాత్రమే కని.. వాటిని సాకారం చేయని నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. 14 ఏళ్లు సీఎంగా చేశా అని చెప్పుకునే ఆయన … తన హయాంలో ఏ ఒక్క పనిని ప్రారంభించి పూర్తి చేసిన చరిత్ర లేదు. హైదరాబాద్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో … ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టుకి అంతే ఉండదు. ఇవన్నీ తన కలలే అని చెప్పుకోవడం నేటికీ ఆయన మానలేదు. అలాగే అధ్బుతమైన రాజధానిగా, ప్రపంచం ఇటు వైపు చూసేలా అమరావతి నిర్మిస్తామని చెప్పి… డిజైన్లను కూడా ఫైనల్ చేయని క్రెడిట్ చంద్రబాబుదే.

తాజాగా కర్నూలు విమానాశ్రయం క్రెడిట్ కొట్టేయడానికి టీడీపీ నాయకులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మా హయాంలోనే నిర్మాణం పూర్తి అయ్యిందని, చంద్రబాబు ప్రారంభించిన దాన్ని మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ ప్రారంభించారని ప్రచారం చేస్తున్నారు. శంకుస్థాపనలు తప్పితే, ప్రారంభోత్సవాలు చేయని ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. కర్నూలు విమానాశ్రయం ఎవరి హయాంలో ఎంత జరిగిందో ఇప్పుడు చూద్దాం.

2014 ఎన్నికల్లో కర్నూలు విమానాశ్రయం పూర్తి చేస్తామని ఇటు వైసీపీ, అటు టీడీపీ హామీ ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో 2016లో విమానాశ్రయ పనులను చంద్రబాబు ప్రారంభించారు. 2019 నాటికి రూ. 80 కోట్లతో 60 శాతం పనులను మాత్రమే పూర్తి చేశారు.

Also Read : గోరంట్ల నోటా జూనియర్ ఎన్టీఆర్ మాటే !

2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి కాని విమానాశ్రయంని ఆర్భాటంగా చంద్రబాబు అదే ఏడాది జనవరిలో ప్రారంభించారు. నిర్మాణం పూర్తి కాని విమానాశ్రయాన్ని ప్రారంభించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఆయన ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఒక్క విమానాయానం కూడా జరగలేదు.

2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం జగన్ విమానాశ్రయ పనులను వేగవంతం చేశారు. 18 నెలల కాలంలో రూ.75 కోట్లు కేటాయించి పనులు వేగంగా సాగేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కర్నూలు వాసులు కంటున్న కల సాకారమైంది. పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.

పట్టిసీమ లోనూ ఇంతే…

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబు చేయని ప్రచారం లేదు. 10 ఏళ్ల కిందట పోలవరం కుడికాలువ పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి, ఆయన హయాంలోనే 85 శాతం పూర్తి చేశారు. కుడికాలువకు పట్టి సీమ అనే పేరు పెట్టి దాన్ని జాతికి అంకితం చేసిన ఘనుడు కూడా చంద్రబాబే. రాష్ట్రంలోని వివిధ ఎత్తి పోతల పథకాల వద్దనున్న భారీ మోటార్లను పట్టిసీమ వద్ద ఏర్పాటు చేస్తే … అవి కాస్త ట్రయల్ రన్ లోనే విఫలమయ్యాయి. చేసిన పని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ, పని చేయడం చేతకాక అవతలి వారు పనులు పూర్తి చేస్తే … అది తమ ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది.

Also Read : ఏపీ అప్పులు.. అసలు నిజాలు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి