iDreamPost

జిల్లాల విభజనపై టీడీపీ ఆందోళనలకు అసలు కారణమదేనా

జిల్లాల విభజనపై టీడీపీ ఆందోళనలకు అసలు కారణమదేనా

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం చేయలేనిది మూడేళ్లలోపులో జగన్ చేసి చూపించారు. ఒక్క జిల్లా ఏర్పాటు కోసం ప్రయత్నించి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన చంద్రబాబు వెనకడుగు వేశారు. 13 జిల్లాలు సెంటిమెంట్ రీత్యా మంచిది కాదని భావించిన చంద్రబాబే 14 జిల్లాలు చేస్తున్నట్టు ప్రకటించి మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ జగన్ అందుకు భిన్నంగా తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి పనిచేశారు. చెప్పిన రీతిలో ప్రతీ పార్లమెంట్ సీటుని ఒక్కో జిల్లాగా మార్చారు. వైశాల్యం రీత్యా అత్యంత పెద్దగా ఉండే ఏజన్సీ అరకు పార్లమెంట్ స్థానాన్ని మాత్రమే రెండు గా చేసి జనాభిప్రాయానికి పట్టంగట్టారు.

ఈ జిల్లాల విభజన వ్యవహారం టీడీపీకి మింగుడుపడడం లేదు. కక్కాలేక మింగాలేక అన్నట్టుగా ఆపార్టీ నేతలున్నారు. ఒక్కో నాయకుడు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వాగతించారు. జిల్లాల విభజనను ఆహ్వానించారు. కానీ అదే జిల్లాలోని ఇతర టీడీపీ నేతలు మాత్రం కొత్త భాష్యాలు చెబుతూ జిల్లాల ఏర్పాటుని విమర్శించడానికి సిద్ధమవుతున్నారు. బహిరంగంగా విమర్శిస్తే జనాలు హర్షించరని సణుగుడు మొదలెట్టారు. ఓవైపు కుప్పం ఎమ్మెల్యే అంటూ చంద్రబాబునుద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలతో సతమతమవుతున్న టీడీపీ నేతలు కొత్త జిల్లాల కారణంగా తమ రాజకీయ పునాదులు కదిలిపోతాయేమో అనే బెంగతో ఉన్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం జిల్లాల విభజనతో కమ్మ కులం ప్రాధాన్యత తగ్గిపోతుందంటూ కొందరు వ్యాఖ్యానాలు చేస్తుండడం విశేషం. కృష్ణా , గుంటూరు జిల్లాల విభజనతో ఎన్టీఆర్ జిల్లా మినహాయిస్తే కృష్ణా జిల్లాలో కమ్మకులం ప్రాధాన్యత తగ్గడం ఖాయమని అంచనా వేస్తున్నారు. కాపులతో పాటుగా గౌడ్ సహా బీసీ కులస్తుల హవా మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు, బాపట్ల విభజనతో కమ్మ కులం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయినట్టుగా ఉందని భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటను కోనసీమలో కలపడం వల్ల అక్కడ కూడా కాపుల హవా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి అనేక పరిణామాలతో కమ్మ కులానికి ఎదురుదెబ్బగా నిలుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిణామాలతో టీడీపీ నేతలు తీవ్రంగా సతమతమవుతున్నారు.పైకి మాట్లాడ లేక లోలోన సతమతమవుతున్నారు.

దాంతో జిల్లాల విభజన వ్యవహారంపై జనసేన, సీపీఐ వంటి పార్టీల నేతలతో తీవ్రంగా విమర్శలు చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ కంట్లో దుమ్ముపడితే తన కంట్లో నలుసు పడిందన్నట్టుగా అల్లాడిపోయే పవన్ ఇప్పుడు ఈ పరిణామాలతో స్వయంగా రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు నాగబాబు కూతురు ఎపిసోడ్, రెండోవైపు జిల్లాల వ్యవహారాన్ని పక్కదారి పట్టించే లక్ష్యంతో పవన్ ని రంగంలో దింపుతున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా తాజా పరిణామాలతో జగన్ వేసిన ఎత్తులు మరోసారి చంద్రబాబుని తీవ్రంగా సతమతం చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి