iDreamPost

అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే యోచనలో టీడీపీ

అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసే యోచనలో టీడీపీ

ఏపీ అసెంబ్లీని బహిష్కరించే యోచనలో విపక్ష పార్టీ కనిపిస్తోంది. మూడు రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించబోతున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగా పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. కీలక నేతలతో పార్టీ అధినేత మంతనాలు జరుపుతున్నారు. రాత్రి జరిగిన సమావేశంలో పలువురు దూరంగా ఉండాలనే సూచన చేసినట్టు సమాచారం. మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి మధ్యాహ్నం తర్వాత నిర్ణయం ప్రకటించే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది.

ఏపీ అసెంబ్లీలో టీడీపీకి అంతంతమాత్రపు బలం మాత్రమే ఉంది. దాంతో ఆపార్టీ తీవ్రంగా ఆపసోపాలు పడుతోంది. సభలో తమ వాణీ వినిపించేందుకు అవకాశం లేకుండా పోయిందని మధనపడుతోంది. చివరకు చంద్రబాబుకి విపక్ష హోదా విషయంలో కూడా నిత్యం సందిగ్ధం మధ్యే సాగాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడం ద్వారా పాలకపక్షం దాడి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని యోచిస్తోంది. ఆన్ లైన్లో నిర్వహించబోతున్న టీడీఎల్పీ మీటింగ్ లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మెజార్టీ నేతలు సభకు దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

సభా సమావేశాలకు ముందుగా టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అచ్చెన్నను అరెస్ట్ చేయడాన్ని కారణంగా చూపించే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుని నిరసిస్తూ సభను బాయ్ కాట్ చేయాలని ప్రతిపాదిస్తోంది. గతంలో విపక్షంలో ఉండగా జగన్ కూడా సభను బహిష్కరించారు. తమకు మైక్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ, ప్రజల్లోనే తేల్చుకుంటామని చెప్పేసిన జగన్ అప్పట్లో పాదయాత్రకు పూనుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

అప్పట్లో శాసనసభను బహిష్కరించిన జగన్ వైఖరిని తప్పుబట్టింది. సభలోనూ, వెలుపలా కూడా పాలకపార్టీ తీరుని దుయ్యబట్టింది. సభ మీద గౌరవం లేకపోవడం అంటే ప్రజల మీద విశ్వాసం లేదన్నట్టుగానే భావించాలని చెప్పింది. అలాంటి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఇప్పుడు తాను కూడా సభను బహిష్కరించాలనే యోచనల చేయడం విచిత్రంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉండగా సుద్దులు చెప్పి, ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి