iDreamPost

బాబు బంపరాఫర్‌..! అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాలు..!!

బాబు బంపరాఫర్‌..! అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాలు..!!

గత సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమితో కోమాలోకి వెళ్లిపోయిన టీడీపీని బతికించుకునేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఒక అవకాశంగా తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయించడం ద్వారా గ్రామాల్లో వర్గాలు కొనసాగుతాయని, తద్వారా ఎప్పటిలాగే టీడీపీ వర్గం నిలబడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి దశ పోరులో ప్రతి పంచాయతీలో నామినేషన్‌ వేయించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఏకగ్రీవాలు కాదు, ఎన్నికలు జరగాలంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బహిరంగా ప్రకటనలు చేశారు. అయినా.. వారి ఆశలు ఫలించలేదు. 16 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మెజారిటీ పంచాయతీల్లో వైసీపీలోని రెండు వర్గాల మధ్యే పోటీ జరగబోతోంది.

బాబు మార్క్‌ రాజకీయం..

తొలి దశలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. మలి విడతల్లో తన రాజకీయాన్ని కొత్త పంథాలో నడిపిస్తున్నారు. గెలుపు, ఓటములు, బలాబలాలతో సంబంధం లేకుండా.. ప్రతి పంచాయతీ, వార్డులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి నామినేషన్‌ వేసేలా ప్రణాళికలు రచించారు. వైఎస్‌ జగన్‌పాలన, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందడంతో గ్రామీణ ఓటర్లు అధికార పార్టీ వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోయామనే అపవాదు మూటగట్టుకోవడం కన్నా.. పోటీకి దూరంగా ఉండడమే మేలంటూ టీడీపీ నేతలు సైలంటయ్యారు. నియోజకవర్గ బాధ్యులు మంతనాలు జరిపినా.. ససేమిరా అంటున్నారు. దీంతో చేసేదేమీ లేక.. కనీసం నామినేషన్లు వేసినా చాలంటూ చంద్రబాబు ఆర్థిక రాజకీయానికి తెరతీశారు. టీడీపీ తరఫున సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసిన వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

సర్పంచ్‌కు లక్ష.. వార్డుకు 25 వేలు..

టీడీపీ తరఫున సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసిన వారికి లక్ష రూపాయలు, వార్డుకు నామినేషన్‌ వేసిన వారికి 25 వేల రూపాయలు అందిస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జులతో ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. నామినేషన్‌ వేయడానికి ముందే సర్పంచ్‌ అభ్యర్థికి, వార్డు అభ్యర్థులకు నగదును ముట్టచెబుతున్నారు. సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటారే అనుమానాలు కూడా టీడీపీ వారిని వెంటాడుతున్నాయి. అందుకే డమ్మీ అభ్యర్థితో నామినేషన్‌ కూడా వేయిస్తున్నారు. ఇందుకు సదరు అభ్యర్థికి 50 వేల రూపాయలు ఇస్తున్నారు. మెయిన్‌ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకున్నా.. డమ్మీ అభ్యర్థి పోటీలో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ రాజకీయం చేస్తోంది. బాబు చేస్తున్న ఈ రాజకీయం ఆ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందో చూడాలి.

Read Also : వైసీపీలోనే పంచాయతీ పోరు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి