iDreamPost

కరోనా కేసుల సంఖ్య పేరుతో రాజకీయాలు చేయటం ఆపండి ..వాస్తవాలు తెలుసుకోండి ..

కరోనా కేసుల సంఖ్య పేరుతో రాజకీయాలు చేయటం ఆపండి ..వాస్తవాలు తెలుసుకోండి ..

రాజకీయ విమర్శలకు కరోనా కూడా ఒక ఆయుధంగా మారింది. కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీలు,మీడియా, ప్రజలు ప్రశ్నించాలి. ఈ సమయంలో రాజకీయాలా ? అన్నది అర్థం లేని వాదన. అదే సమయంలో అసత్యాలు పునాదిగా విమర్శలు మంచిది కాదు. అది రాష్టానికి చేటు కలిగిస్తుంది. 

సంఖ్యల మాయాజాలం….

ఏపీలో కేసులు పెరుగుతున్నాయి అనే దాని కన్నా బయట పడుతున్నాయి అనడం బాగుంటుంది. రాజకీయంగా విమర్శలు చేసే వారు పొంతన లేని లెక్కలతో విమర్శలు చేయడం మంచిది కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని కర్నూలు, గుంటూరు , కృష్ణా , చిత్తూరు జిల్లాలలో కేసుల సంఖ్య ఎక్కువ అన్నది వారి వాదన.

దేశంలో అన్ని జిల్లాల విస్తీర్ణం ఒకేలా ఉందా ? ఉదాహరణకు తెలంగాణలో ములుగు , గద్వాల్ జిల్లాలు 10 మండలాలలోపే అలాంటి జిల్లాలను 65 మండలాలు ఉన్న చిత్తూరు జిల్లాతో పోల్చగలమా ? అంత ఎందుకు ఉభయగోదావరి జిల్లాలు ఒక్క అనంతపురం జిల్లాకు సమానం. గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుకుంటే 391 కేసులు అంతకన్నా చిన్నది తెలంగాణలోని GHMC.అక్కడ 540 కేసులు GHMC ని జిల్లాలుగా విడివిడిగా చూపి విమర్శలు చేయడం వల్ల లాభం లేదు. పాత నల్లగొండ జిల్లా చిత్తూరు జిల్లాకు సమానం.నేడు చిత్తూరు జిల్లాలో 73 కేసులు నమోదయ్యాయి. అదే పాత నల్లగొండ జిల్లాలో కేసులు 100, నేడు అది 3 జిల్లాలుగా మారింది. అక్కడ భువనగిరిలో ఒక్కటి నమోదు కాలేదు. మరో రెండు జిల్లాలు అయిన సూర్యాపేట, నల్గొండ కలిపి 100 కేసులు పొంతన లేని లెక్కలతో విన్యాసాలు చేసి విమర్శలు చేయడం వల్ల సాధించేది ఏమిటి?

60 వేల పరీక్షలకు 1097 కేసులు నమోదు కాగా 14 వేల పరీక్షలకు 943 కేసులు.., ఏది ఎక్కువ ?

ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన ద్వారా ఇప్పటికి 60 వేలు పరీక్షలు చేయడం వల్ల 1097 కేసులు నమోదయ్యాయి. అదే తెలంగాణలో వారి లెక్కల ప్రకారం దాదాపు 14 వేల లోపు పరీక్షలు జరిపడం వల్ల 943 కేసులు నమోదయ్యాయి. సమస్య తీవ్రతను ఎలా లెక్కగడతారు?

ఈ లెక్కలు ద్వారా ఏపీలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి అని రాజకీయ విమర్శలు చేయడం సమంజసం కాదు. మరో ముఖ్యమైన ఉదాహరణ తీవ్ర ఆందోళన చెందుతున్న మహారాష్ట్రలో అందుతున్న సమాచారం ప్రకారం 75838 పరీక్షలు చేయగా 5221 కేసులు నమోదయ్యాయి. ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసులు బయటపడుతున్నాయి అన్నది కీలకం.

ఈ లెక్కలను ఆధారంగా చూపించి ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఎక్కువ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు నమోదయ్యాయి , అందువల్ల విమర్శలు వచ్చిపడుతున్నాయి కనుక ఏపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల లాగే పరీక్షలు నిర్వహణ తగ్గిస్తే ఎవరికి లాభం. సమాజంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించి కేసులను బయటికి తీసుకురావడం ద్వారానే రోగులకు, సమాజానికి మేలు జరుగుతుంది.కరోనా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అధికార పార్టీ , ప్రభుత్వ నిర్వాహకం వల్ల తప్పు జరిగిన చోట స్పష్టంగా పేర్కొని కచ్చితమైన విమర్శలు చేయడాన్ని తప్పు పట్టలేము. అవసరం కూడాను. కానీ రాజకీయ విమర్శల కోసం పొంతనలేని లెక్కలు , అర్థంలేని ఆధారాలతో అధికార పార్టీ,ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్ల అధికార,విపక్ష పార్టీలకు లాభ నష్టాలు సంగతి ఎలా ఉన్న రాష్ట్రానికి మాత్రం చేటు కలిగిస్తుందనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి