iDreamPost

ఇంట్లో కూర్చొని టీడీపీ నేతల మీడియా మేనేజ్‌మెంట్‌…

ఇంట్లో కూర్చొని టీడీపీ నేతల మీడియా మేనేజ్‌మెంట్‌…

ఎక్కడైనా విపత్తుల సమయంలో అధికార పార్టీ కంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలే చురుగ్గా ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఏపీలో ప్రతిపక్షం మాత్రం పూర్తి విరుద్ధం. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ఆ పార్టీ నేతలు ఇళ్లలో కూర్చొని ప్రభుత్వం అర్థంపర్థం లేని విమర్శలు చేస్తూ మీడియా మేనేజ్‌మెంట్‌తో పబ్బం గడుపుకుంటున్నారు.

వడ్డించేవాడు మనోడైతే ఏ మూలన కూర్చున్నా అన్నీ సమకూరుతాయన్న తీరుగా.. టీడీపీ నేతలు ఎక్కడిక్కడ ఇంట్లో కూర్చున్నా మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తాము కనపడేలా చూసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇంట్లో కూర్చుని ఉచిత సలహాలు పడేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్ఫూర్తితో నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా రాజకీయాలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా అదే పనిగా ఆ పార్టీ నేతలు తమ అనుకూల మీడియాలో కనపడేలా పక్కా ప్లాన్‌ చేసుకున్నారు.

చంద్రబాబు అయితే ప్రతి రోజూ లేఖలు విడుదల చేయడం, ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలన్న దానిపై పార్టీ నేతలకు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హిత బోధ చేయడం, ఆన్‌లైన్‌లోనే మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఓ వర్గం మీడియా వాటికి విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. ఆయన స్ఫూర్తితో ఆ పార్టీ నేతలు ఇళ్లలో కూర్చొని దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు.వాటిని మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చూసుకుంటున్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులంతా ట్విట్టర్‌ ద్వారా ఏదో ఒక ప్రకటన వదిలి మీడియాలో ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఇందులో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశం లేకపోయినా మీడియా మాత్రం హడావుడీ చేస్తూ ఉంటోంది.

ప్రభుత్వంపై బురద జల్లడం, కరోనాపై ప్రజల్లో భయాలు, అపోహలు, పుకార్లు సృష్టించడం, వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు చేసే లక్ష్యంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి