iDreamPost

నాటి బలమేది చినరాజప్ప..?

నాటి బలమేది చినరాజప్ప..?

పట్టణ ఎన్నికల్లో హేమాహేమీలైన తెలుగుదేశం పార్టీ నాయకులకు భంగపాటు తప్పలేదు. ప్రజలు ఏకపక్షంగా ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయడంతో రిజల్ట్స్‌ వెల్లడి మొదలైనప్పటి నుంచే సదరు నాయకులు, వారి అనుచరుల్లో నైరాశ్యం అలముకుంది. ముఖ్యంగా ఏపీలో అతిపెద్ద జిల్లాగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా నుంచి టీడీపీలో కీలక నాయకులుగా ఎదిగిన వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేసిన నిమ్మకాయల చినరాజప్పకు ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం పరిధిలోని రెండు మున్సిపాల్టీల్లోనూ ఘోర పరాజయం ఎదురైంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు నాయుడికి నమ్మిన బంటుగా ఉన్న రాజప్ప పరిస్థితి ఈ విధంగా మారడం వెనుక ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే కారణమన్న వాదనలు కూడా విన్పిస్తున్నాయి. పెద్దాపురం మున్సిపాల్టీలో 29 వార్డులకు గాను 26 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. టీడీపీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 16 మందికిపైగా కౌన్సిలర్లు 130కి పైగా ఓట్లు మెజార్టీ సాధించారు. అత్యధిక మెజార్టీ 510 ఓట్లు కావడం గమనార్హం. అలాగే సామర్లకోట మున్సిపాల్టీల్లో మొత్తం 31 స్థానాలకు గాను 29 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ కూడా రెండు స్థానాలతోనే టీడీపీ సరిపెట్టేసుకుంది.ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు భారీ మెజార్టీతోనే విజయాలు నమోదు చేసుకున్నారు. ఈ రెండు చోట్లా గత మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు పూర్తి రివర్స్‌లో రావడం గమనార్హం.

2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఈ రెండు చోట్లా కలిపి 10 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం చేయగలిగింది. పెద్దాపురం పట్టణంలో పోలైన ఓట్లలో దాదాపు 58శాతం మంది వైఎస్సార్‌సీపీకే ఓటు వేయడం గమనార్హం. అంటే ఎమ్మెల్యేగా చినరాజప్పను 2019లో గెలిపించినప్పటికీ ప్రస్తుతం పట్టణ ఓటర్లు ఆయన్ను తిరస్కరించినట్లయిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజప్ప నివాసం ఉంటున్న అచ్చంపేట గ్రామంలో సైతం అన్ని వార్డులను వైఎస్సార్‌సీపీయే విజయం సాధించడాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.

జిల్లాలోని కోనసీమ ప్రాంతమైన అమరాపురం పట్టణానికి చెందిన చినరాజప్ప వలస నాయకుడిగా 2014 ఎన్నికల్లో పెద్దాపురం వెళ్ళారు. సుదీర్ఘకాలం జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పని చేసిన రాజప్ప పోటీ చేసిన తొలిసారే గెలిచారు. అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పదవి గంటా శ్రీనివాసరావుకు దక్కుతుందనే ప్రచారం జరగ్గా.. రాజప్పను వరించడం విశేషం. ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వశాఖ బాధ్యతలు చూస్తున్నా.. కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసే అధికారం రాజప్పలేకపోయినా.. చినబాబు క్లాస్‌లు తీసుకున్నా.. సర్దుకుపోయారు.

Also Read : మండపేట లో తోట త్రిమూర్తులు ఏమి మ్యాజిక్ చేశాడు ?

2019లో చివరి దొరబాబు స్థానంలో వైసీపీ తోట వాణిని అభ్యర్థిగా రంగంలోకి దించడం, సమయం తక్కువగా ఉండడం వల్ల ఆమె ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో చినరాజప్ప 4,027 ఓట్లతో గట్టెక్కారు. అయితే తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీల్లోనూ టీడీపీ ఘోర పరాజయం పాలైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి